నందిగామ ప్రయోజనాలను కాలరాయొద్దు
నందిగామ రూరల్: ప్రమాద సమయంలో ప్రతి నిముషం విలువైనదేనని, నందిగామ పట్టణంలో చేపడుతున్న వంద పడకల ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి స్థలంలో కాకుండా ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రాంతంలో నిర్మించాలని కోరుతూ శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. లేఖలోని వివరాల మేరకు.. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గత ప్రభుత్వంలో అప్పటి శాసన సభ్యుడు డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు వంద పడకల ఆస్పత్రి అవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే మంజూరు చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ. 31.98 కోట్లు, స్థల సేకరణకు రూ. 2.5 కోట్లు మంజూరు చేస్తూ 2023, ఏప్రిల్‌లో జీవో నంబర్ 46ను జారీ చేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా చేపడుతున్న ఆస్పత్రి నిర్మాణానికి రైతులు, తదితరులు మార్కెట్ ధరలకు కాకుండా బడ్జెట్‌లో కేటాయించిన ధరకు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఐదెకరాల భూములను అందించేందుకు ముందుకు రావటంతో జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
మారిన పరిస్థితులు..
శంకుస్థాపన తర్వాత జరిగిన ఎన్నికలలో ప్రభుత్వం మారటంతో ప్రస్తుత నందిగామ ఎమ్మెల్యే ఆకాంక్ష మేరకు 2024 డిసెంబర్ 12న హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించి.. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి ఆవరణలోనే నూతనంగా వంద పడకల ఆస్పత్రి నిర్మించేందుకు తీర్మానం చేశారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరిస్తూ 2025 ఫిబ్రవరి 12న జీవో నంబర్ 82ను విడుదల చేసింది.
ఇబ్బందులు తప్పవు..
ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని మార్చాలనే ఎమ్మెల్యే నిర్ణయం సరైనది కాదని పెద్దలు, మేధావులు అంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఉన్న 2.4 ఎకరాలలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సైతం చెప్పింది. 2.4 ఎకరాలలో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తే భవిష్యత్‌లో అవసరమైన అదనపు భవనాల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతాయి. విషయాన్ని పరిశీలించి జీవో నంబర్ 46 ప్రకారం గతంలో సేకరించిన ఐదెకరాల స్థలంలో వంద పడకల ఆస్పత్రి నిర్మించి మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిచేలా చర్యలు తీసుకోవాలని అరుణకుమార్ లేఖలో కోరారు. తాము సేకరించిన స్థలంలో ఆస్పత్రి నిర్మించటం ఇష్టం లేకపోతే మరొక చోట ఐదెకరాల భూమిని ప్రభుత్వ బడ్జెట్ ధరకు కొనుగోలు చేసి వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని ఆయన విన్నవించారు.
వంద పడకల ఆస్పత్రిపై సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ అరుణకుమార్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment