సమష్టి కృషితోనే సారా కట్టడి సాధ్యం
తిరువూరు: తిరువూరు డివిజన్లో సారా రాక్షసి విజృంభిస్తున్న విధానంపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. నవోదయం 2.0 కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. స్థానిక శ్రీవాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో సారా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై పలు శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు డివిజన్లోని 4 మండలాల్లో 26 గ్రామాలలో కాపుసారా తయారీ తీవ్రంగా ఉందని, ఎన్ని చర్యలు తీసుకున్నా కట్టడి జరగట్లేదన్నారు. గ్రామస్థాయి అధికారుల నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి సమష్టిగా కృషి చేస్తేనే సారా సమగ్ర నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. సారా తయారీ, అమ్మకాలే జీవనోపాధిగా కలిగిన వారికి సబ్సిడీ లోన్లు ఇచ్చి ఇతర వృత్తుల్లోకి మళ్లిస్తామని, వారిలో మార్పు తీసుకువస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 2047 విజన్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలనే లక్ష్యంతో, పేదరిక నిర్మూలన ధ్యేయంగా జిల్లాలో పీ4 సర్వే చేస్తున్నామన్నారు.
మార్పు వస్తేనే ఫలితం..
నవోదయం 2.0 విజయవంతం కావాలంటే మార్పు తీసుకురావాలని సూచించారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి మాట్లాడుతూ ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధికి గురైన కుటుంబాలు సారా సేవించడమే కారణమన్నారు. కేసులు నమోదు చేస్తే సారా నియంత్రణ కాదని, తయారీదారులు, అమ్మకందారుల్లో పరివర్తన తీసుకురావడమే తక్షణ కర్తవ్యమని సూచించారు. సారా కట్టడికి కలిసి కృషి చేస్తామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ వై. శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఎస్. శ్రీనివాసరావు, తిరువూరు ఎకై ్సజ్ జె. శ్రీనివాసరావు, తిరువూరు సీఐ గిరిబాబు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాల అధికారులు, గ్రామ సారా నిషేధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment