ఆక్టోపస్ మాక్‌డ్రిల్ అదుర్స్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బుధవారం అర్ధరాత్రి సమయం.. దుర్గ గుడి వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.. ఆలయం పరిసరాలను పారి శుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.. కొద్ది గంటల్లో అమ్మవారి సుప్రభాత సేవకు సమయం దగ్గర పడుతుండటంతో ఎవరి హడావుడిలో వారున్నారు.. మహా మండపం మొదటి అంతస్తులో భక్తులు పిల్లా పాపలతో కలిసి నిద్ర చేస్తున్నారు.. ఒక్క సారిగా మహా మండపం, ఆలయ ప్రాంగణాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.. ఆరుగురు ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి పొగ బాంబులు విసురుతూ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు.. ఒక్క ఉదుటున భక్తుల మధ్యకు చేరి భయభ్రాంతులకు గురిచేశారు.. ఆలయ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై స్పెషల్ ఫోర్స్ కమాండోలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండోలు ధైర్యసాహసాలతో భక్తుల మధ్య దాక్కుని ఉన్న ఆగంతకులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదంతా నిజం కాదు. ఆక్టోపస్ కమాండోల మాక్‌డ్రిల్. ఈ నిజం తెలుసుకున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం రాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. దుర్గామల్లేశ్వర స్వామి వార్లను ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనుకోని రీతిలో, విపత్కర పరిస్థితుల్లో తీవ్రవాదులు ఆలయంపై దాడులు చేస్తే వారికి ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ఏ విధంగా కాపాడాలనే దానిపై క్షేత్ర స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్‌డ్రిల్‌లో వంద మందికి పైగా కమాండోలు, అధికారులు భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం దేవస్థానానికి చెందిన జమ్మిదొడ్డి ఆవరణలోని పరిపాలనా భవనంలోని బోర్డు మీటింగ్ హాల్‌లో ఆక్టోపస్ బృందానికి చెందిన కమాండోలు ఆలయ అధికారులతో సమావేశమై భద్రతా వ్యవహా రాలపై చర్చించారు. దేవస్థానంలో కీలక ప్రాంతా లను పరిశీలించిన ఆక్టోపస్ బృందాలు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశాయి. ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఇంజినీరింగ్ అధికారులు, సెక్యూరిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న ఆక్టోపస్ కమాండోలు
ఆక్టోపస్ మాక్‌డ్రిల్ అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment