మధ్యాహ్న భోజన కార్మికుల ఆకలి కేకలు
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.3 వేల వేతనమా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల తమ పిల్లలకు ఒక పూట భోజనానికి ఎంత ఖర్చు పెడుతు న్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ‘మీకో న్యాయం. పేద పిల్లలకో న్యాయమా? ప్రభుత్వానికి సిగ్గుండాలి’ అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో వేతనాలు, మెస్ చార్జీలు పెంచాలని విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లా డుతూ.. కార్మికులకు కనీసం వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కార్మికులకు వేతనాలు పెంచకుండా వారి డొక్కలు ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు. నెలకు కేవలం రూ.3 వేల వేతనంతో ఒక కుటుంబం ఎలా జీవిస్తుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకటరామారావు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్‌బాబు, ఏఐటీయూసీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ.. పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వేతనాలు పెంచా లని మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మికులకు కనీసం రూ.10 వేల వేతనం చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బుచ్చిబాబు, చాంద్ బాషా, పుల్లారావు, ప్రమీలమ్మ, ఈశ్వరమ్మ, బాషా, లాజర్, కవిత, సులోచన, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒక కుటుంబానికి రూ.3 వేల వేతనం ఎలా సరిపోతుంది? మీ పిల్లలకు ఇలానే ఖర్చు చేస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మధ్యాహ్న భోజన కార్మికుల ఆకలి కేకలు
Comments
Please login to add a commentAdd a comment