చాపచుట్టేశారు!
అత్యవసర పశు వైద్యానికి మంగళం
పామర్రు: గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే. పల్లెల్లో రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే పాడి పంటలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కలిసి రాక పోయినా పాడి ద్వారా కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. అటువంటి పాడి పశువులకు అత్యవసర వైద్య సేవలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం సంచార అంబులెన్సులను నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసింది. వీలైతే ఇంటి వద్దకే వైద్యం, మెరుగైన వైద్యం అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సేవను కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది.
కక్షపూరితంగా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2021లో మొదటి విడతలో 9, రెండో విడతలో 10 వాహనాలు మంజూరు చేసింది. ఒక్కొక్క వాహనంలో వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలెట్ కలిపి నలుగురు ఉంటారు. మారుమూల గ్రామాల్లోనూ పశువులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే అంబులెన్సులు నేరుగా ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తాయి. అత్యాధునికంగా హైడ్రాలిక్ సిస్టమ్‌తో పశువులను నేరుగా అంబులెన్సులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించి తిరిగి తీసుకు వచ్చే విధంగా వీటిని రూప కల్పన చేశారు. వీటి ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా ఇంటి వద్దనే వైద్యం అందేది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి నిర్వహణ బాధ్యతలను జీవీడీ ఫౌండేషన్‌కు అప్పగించింది. దీనికి గత నెలలో గడువు ముగిసింది. ఫలితంగా మార్చి 1వ తేదీ నుంచి మొదటి ఫేజ్‌లో మంజూరైనా 9 అంబులెన్సులు నిలిపి వేసి అందులో పని చేసే వారిని ఇంటికి పంపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు వైఖరిపై మండిపడుతున్నారు.
సంచార అంబులెన్సుల నిలిపివేత పాడి రైతులకు శాపంగా పరిణమించిన ప్రభుత్వ నిర్ణయం వైద్యులు, టెక్నీషియన్, ఫార్మసిస్టులు, పైలెట్ కొలువులు గోవిందా గత ప్రభుత్వ పథకాలపై కూటమి సర్కార్ కక్ష
Comments
Please login to add a commentAdd a comment