సన్నచిన్నకారు రైతులకు ‘ఉపాధి’ ఊతం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
చందర్లపాడు(నందిగామ రూరల్): ఉపాధి హామీ పథకంలో చిన్నసన్నకారు రైతులకు నూరు శాతం రాయితీపై ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి పొందుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చందర్లపాడు మండలం ముప్పాళ్ల సమీపంలో చేపడుతున్న డ్రాగన్ ఫ్రూట్, నిమ్మతోటలను బుధవారం ఆయన పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు కోనంగి భారతి, కొనంగి తిరుపతమ్మ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా అర ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్, రెండెకరాలలో నిమ్మ తోట సాగు చేస్తున్నట్లు తెలిపారు.
1300 ఎకరాల్లో సాగు..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1300 ఎకరాలలో పండ్లు, పూలు, మునగ తోటల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, నారింజ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జీడిమామిడి, దానిమ్మ, నేరేడు, ఆపిల్‌బేర్, తదితర పండ్ల తోటలతో పాటు మునగ, పామాయిల్ వంటి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు వారికి అవసరమైన పండ్లు, పూలు, మొక్కలు, ఎరువులను నేరుగా కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చును ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయటం, మొక్కలు నాటిన తర్వాత మూడేళ్ల పాటు మొక్కల పెంపకం నిర్వహణకు ఉపాధి హామీ పని దినాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, ఇన్‌చార్జ్ మండల అధికారి నాంచారయ్య, ప్లాంటేషన్ జిల్లా మేనేజర్ ఉషారాణి, సూపర్‌వైజర్ వెంకటేశ్వరరావు, ఏపీవో వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్ సాయికృష్ణ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ వంశీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment