సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి
గుణదల(విజయవాడ తూర్పు): పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా అన్ని శాఖల అధికారలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి అన్నారు. గుణదలలోని హయత్ ప్లేస్ హోటల్లో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్, టూరిజం రంగ అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పర్యాటలకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. హోటల్ యాజమాన్యాలు సైతం పర్యాటక మిత్ర విభాగాలుగా పనిచేయాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లాల మధ్య పోటీతత్వంతో పాటు సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
వృద్ధి సాధించాలి..
అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో 66 శాతం సేవా రంగానికి వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రంగంలో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 22.22 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు.
రాత్రి 12గంటల వరకే అనుమతి..
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో హోటళ్లు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచే విధంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల తరువాత పొడిగింపుపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. విజయవాడ పర్యాటకానికి అనుకూలమైన నగరమని టూరిస్టులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు నగరంలో 3500 సీసీ కెమెరాలను వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. వీరాస్వామి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్, జిల్లా పర్యాటక అధికారి ఎ. శిల్ప, జిల్లా పరిశ్రమల అధికారి బి. సాంబయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment