పటమట(విజయవాడతూర్పు): ప్రజల క్షేమం, నగరాభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో వీఎంసీ బడ్జెట్ 2024–25కి సంబంధించి చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
ఆ వివరాలు ఇవి..
● రూ.40.9 కోట్లతో 47.46కి.మీ. మేర సీసీ రోడ్లు, రూ.6.80కోట్లతో 4.33 కి.మీ. మేర బీటీ రోడ్లు వేశామని మేయర్ చెప్పారు.
● 15వ ఆర్థిక సంఘం నిధులతో 24.91కి. మీ. మేర రూ.17 కోట్లను ఆమోదించి కొండ ప్రాంతంలో మెట్లు, ల్యాండింగ్, ర్యాంప్ వంటి పనుల కోసం రూ. 2.95 కోట్లను వెచ్చించామన్నారు.
● 40వ డివిజన్‌లో 1500 లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను రూ. 3.30 కోట్లతో నిర్మించామని, వేసవిలో తాగునీరు అందించే విధంగా రిజర్వాయర్‌ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 46వ డివిజన్‌లో 500లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ 90% పనులు పూర్తి చేశామన్నారు.
● 30వ డివిజన్‌లో దావు బుచ్చయ్య కాలనీలో రూ.1.5 కోట్లతో 4.5 కిలోమీటర్ల నూతన పైప్ లైన్ వేశామని, రూ.3.29 కోట్లతో 3 కి.మీ. పైప్ లైన్ పనులు చేపట్టామని చెప్పారు.
● రూ.14.16 కోట్లతో 3 నియోజకవర్గాలు డ్రెయినేజీలను నిర్మించామని, రూ.1.9కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ 33.54 కి.మీ నిర్మాణ పనులు చేపట్టామని, రూ. 6కోట్లతో విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు.
● రూ.17.4కోట్లతో 3.20 మీటర్ల పొడవుతో రైల్వే అండర్ బ్రిడ్జిని మధురానగర్‌లో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
● మూడు నియోజకవర్గాల పరిధిలోని రూ.3 కోట్లతో పార్కులు, కెనాల్ సుందరీకరణ చేశారని, నగరంలోని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన 12 వేల టన్నుల చెత్తని తొలగించామన్నారు.
ఆదాయం రూ. 168.8కోట్లు..
2024–25 ఆర్థిక సంవత్సరంలో 163.8 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చిందని మేయర్ తెలిపారు. ఆస్తి పన్నులు 109.23 కోట్ల ఆస్తి పన్ను ఈ ఏడాది వసూలు అయిందని, ఖాళీ స్థలాల పన్ను రూ.9.80 కోట్లు, రూ.18.46 కోట్లు నీటి పన్ను వసూలు అయిందన్నారు. సీవేజ్ చార్జీలు రూ. 18కోట్లు వచ్చాయని, రూ.6.59 కోట్లు వాటర్ మీటర్ చార్జీలు వసూలు అయ్యాయన్నారు. పట్టణ ప్రణాళికలో 1216 దరఖాస్తులు రాగా వాటి ద్వారా వీఎంసీకి రూ.56.13 కోట్లు, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) 2020లో భాగంగా రూ. 26.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కారుణ్య నియామకం ద్వారా 10 మందికి ఉద్యోగాలు కల్పించామని, పార్కులు, షాపులు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, ఆడిటోరియం, కర్మల భవన్ నుంచి రూ.19.20 కోట్లు వీఎంసీకి సమకూరాయన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
నేడు వీఎంసీ బడ్జెట్ సమావేశం
విజయవాడ నగరపాలక సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై శనివారం కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.