గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినియోగ దారుల ప్రయోజనాలకు భరోసా కల్పించేలా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ, మార్కెట్ జోక్యం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి, మార్చితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కూరగాయల ధరల్లో వ్యత్యాసాలు, విజయవాడ రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ కూరగాయల మార్కెట్, కాళేశ్వరరావు రిటైల్ మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా విజయవాడ రైతుబజార్లలో నిర్ణయించిన ధరలు, బియ్యం, కందిపప్పు, పామాయిల్ తదితర నిత్యావసర సరుకుల ధరల్లో మార్పులు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులు, వినియోగదారులు, వ్యాపార వాణిజ్య వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రణాళికల రూపకల్పన, అమలు లక్ష్యంగా ఏప్రిల్‌లో భాగస్వామ్య పక్షాలతో వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎస్‌వో ఎ.పాపారావు, జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ