
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇస్లాం శాంతిని బోధిస్తుందని, చెడును మంచి ద్వారా తొలగించాలని సూచిస్తుందని హైదరాబాద్‌కు చెందిన మౌలానా మొహమ్మద్ అజీజ్ ఉద్దీన్ సిద్ధిఖీ అన్నారు. విజయవాడ ఈద్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈదుల్ ఫితర్ నమాజు నిర్వహించారు. పలుప్రాంతాల ముస్లింలు సుమారు 15 వేల మంది వరకూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధిఖీ ఉర్దూ ప్రసంగం, నమాజు, దువా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నిరసనలు తెలియజేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2024 ద్వారా బీజేపీ ప్రభుత్వం ముస్లింపై దాడి చేస్తోందన్నారు.
ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన కూటమి
ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని, పవిత్ర రంజాన్ నాడు నిరసన తెలిపే పరిస్థితులు రావడం దురదృష్టకరమని అన్నారు. నేడు ముస్లింలు తమ ఆస్తులను కాపాడాలంటూ దువా చేయాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ, ఏపీలోని టీడీపీ జనసేన లేనన్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు అండగా ఉంటామని అబద్ధాలు చెబుతున్నారని, లోక్‌సభ, రాజ్యసభల్లో ముస్లింలకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచింది వైఎస్సార్ కుటుంబమేనన్నారు. పార్లమెంటులో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని, ఎలాంటి మొహమాటం లేకుండా రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు వ్యతిరేకించినట్లు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును టీడీపీ, జనసేన ఎంపీలు ఎందుకు వ్యతిరేకించలేక పోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈద్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కాలేషావలి, ప్రధాన కార్యదర్శి మునీర్ అహ్మద్ షేక్ తదితరులు పాల్గొన్నారు.