ఊయల వేడుకకు వస్తూ.. | - | Sakshi
Sakshi News home page

ఊయల వేడుకకు వస్తూ..

Published Tue, Apr 1 2025 11:54 AM | Last Updated on Tue, Apr 1 2025 2:48 PM

టోల్‌ప్లాజా వద్ద..

అవనిగడ్డ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మూడు నెలల కుమారుడిని సంతోషంగా ఊయలలో వేద్దామనుకున్న వారి ఆనందం తీవ్ర విషాదంగా మారింది.మరో ఐదు నిమిషాలైతే దేవస్థ్ధానానికి చేరుకునేవారు. బాలుడిని ఊయలలో వేసి ఎంతో సంతోషించేవారు. అంతలోనే లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. మండల పరిధిలోని పులిగడ్డ టోల్‌ప్లాజా వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి చించినాడకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

సీటు కింద

ఘటనలో వెనుకసీటులో తల్లిఒడిలో ఉన్న మూడు నెలల షణ్ముఖ ముందుకు ఢీకొని చనిపోయి సీటు కిందకు జారిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌.. మోహనబాబు, అరుణ మృత దేహాలను సిబ్బంది సాయంతో బయటకు తీశారు. గాయాలపాలైన సాత్వికను, సందీప్‌, పల్లవిని వెంటనే 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీటు కింద అచేతనంగా ఉన్న మూడేళ్ల షణ్ముఖను గుర్తించి బయటకు తీశారు.

మరో ఐదు నిమిషాల్లో గుడికి

ప్రమాదం జరిగిన ప్రాంతం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. మరో ఐదు నిముషాలు గడిస్తే వారంతా ఆలయానికి వెళ్లి షణ్ముఖను ఊయలలో వేసేవారు. అంతలోనే ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌, సర్పంచ్‌ దాసరి విజయ్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఎక్కించి అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ట్రాక్టర్‌ సాయంతో కారుని పక్కకు తీయించి ట్రాఫిక్‌ని పునరుద్ధరించారు.

విషమంగా పల్లవి పరిస్థితి

గాయపడిన పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెతో పాటు స్వల్పగాయాలైన సందీప్‌ను మరింత మెరుగైన చికిత్స కోసం బందరు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

లారీ రూపంలో కబళించిన మృత్యువు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పులిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సీటు కింద విగతజీవిగా మూడునెలల బాలుడు

తెనాలికి చెందిన జిడుగు మోహన్‌బాబు(57), భార్య అరుణ(50), కుమారుడు సందీప్‌, కోడలు పల్లవి, మనవరాలు సాత్విక(5), మూడునెలల మనవడు షణ్ముఖతో కలసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి సోమవారం మధ్యాహ్నం బయలు దేరారు. షణ్ముఖను ఊయలలో వేసేందుకు కారులో వస్తున్నారు. సందీప్‌ కారునడుపుతున్నాడు. పులిగడ్డ – పెనుమూడి వంతెన దాటిన తర్వాత టోల్‌ప్లాజాకు సమీపంలో ఎదురుగా పామాయిల్‌ లోడుతో వస్తున్న లారీ కారుని ఢీకొంది. ముందు సీటులో కూర్చున్న మోహనబాబు, వెనుక సీటులో కూర్చున్న అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న సాత్వికను తొలుత అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా అప్పటికే పాప చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

ఊయల వేడుకకు వస్తూ.. 1
1/2

ఊయల వేడుకకు వస్తూ..

ఊయల వేడుకకు వస్తూ.. 2
2/2

ఊయల వేడుకకు వస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement