
మందుల మాయాజాలం
మందుల్లో మూడు రకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మందులోడా ..ఓరి మాయలోడా అని మనం చిన్నప్పుడు ఒక పాట విన్నాం. ఇప్పుడు అది నిజమవుతోంది. మందుల షాపుల్లోకి వెళ్లి మనం ఏం కొన్నా కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. ఆస్పత్రుల్లో కూడా అదే పరిస్థితి. ఒక మందు కొంటే ఎమ్మార్పీపై 50 నుంచి 70 శాతం మార్జిన్ ఉంటుందంటే దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు సైతం తక్కువ ధరకు మందులు ఇచ్చేందుకు జన ఔషధి షాపులు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారే కానీ, జనరిక్ మందులపై ఎమ్మార్పీలను మాత్రం నియంత్రించలేక పోతున్నారు. దీంతో మనం ఏ షాపుకెళ్లినా జనరిక్, జనరల్ మందులను అంటగట్టేస్తున్నారు. ఆ దోపిడీ ఫార్మసీ నిపుణులు సైతం గుర్తించలేనంతగా ఉంటోంది. దీంతో మందులు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు దారుణంగా మోసపోతూనే ఉన్నాడు.
నిపుణులు కూడా గుర్తించలేరు
మందుల్లో జరుగుతున్న మాయ ఫార్మసీ నిపుణులు సైతం గుర్తించలేని విధంగా ఉంటుంది. మనకు వైద్యులు ఫార్మా మందు రాసినప్పటికీ, ఫార్మసీలో ఇచ్చేది మాత్రం జనరల్ మందే. పేరు మారిందని ప్రశ్నిస్తే మందు ఒకటే, ఆ కంపెనీ స్టాక్ లేదని చెప్పుకొస్తారు. ఇలా మందుల అమ్మకాల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప చర్యలు లేవు. ప్రాణాంతక క్యాన్సర్ మందుల విక్రయాల్లో సైతం పెద్ద ఎత్తున మార్జిన్ ఉంటుంది. వాటిపై కూడా ఎమ్మార్పీని నియంత్రించడం లేదు. దీంతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎమ్మార్పీ ధరకే వాటిని కూడా అమ్మేస్తున్నారు. క్రానిక్ మైలాయిడ్ లుకేమియా(సీఎంఎల్)కు వాడే ఇమాటినిబ్(10 బిళ్లలు) ఎమ్మార్పీ రూ.1875 ఉంటుంది. కానీ బయట తెలిసిన వారి వద్ద తీసుకుంటే అవే బిళ్లలు రూ.500కు కూడా ఇస్తున్నారు. ఇలా ప్రాణాంతక మందుల్లో సైతం పెద్ద ఎత్తున దోపిడీ చేసేస్తున్నారు.
ఎమ్మార్పీలపై నియంత్రణ ఏదీ?
మందుల ఎమ్మార్పీలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైస్ కంట్రోల్‌బోర్డు పర్యవేక్షిస్తుంది. మందులపై ధరలు ఇష్టారాజ్యంగా ఉంటున్నా బోర్డు నియంత్రించక పోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పే జనరిక్ మందులపై ఎమ్మార్పీ ఎందుకు అంత ఎక్కువ ముద్రిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంతకు అమ్ముతున్నారో అంతే ఎమ్మార్పీ ఇస్తే కొనుగోలు దారుడు మోసపోయే అవకాశం ఉండదంటున్నారు.
సాధారణంగా మందులు మూడు రకాలుగా మార్కెట్‌లో లభిస్తుంటాయి. ఫార్మ, జనరల్, జనరిక్‌గా మందులు ఉంటాయి.
● మొదటిగా ఫార్మా మందుల అమ్మకాలపై మార్జిన్ తక్కువగా ఉంటుంది. రిటైలర్స్‌కి మందు, కంపెనీని బట్టి 20 నుంచి 25 శాతం మాత్రమే మిగులుతుంది. దీంతో వీటిని మందుల షాపుల్లో తక్కువగా విక్రయిస్తుంటారు.
● రెండో రకం జనరల్ మందులు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడు పోతున్న మందులు ఇవే. వీటి అమ్మకంపై 50 నుంచి 60 శాతం వరకూ మార్జిన్ ఉంటుంది. దీంతో ఆస్పత్రులతో పాటు, మందుల షాపుల్లో సైతం ఈ మందులే ఎక్కువగా అమ్మకాలు జరుపుతున్నారు.
●మూడో రకం జనరిక్. ఈ మందుల్లో ఎమ్మార్పీపై 80 శాతం వరకూ రాయితీ ఉంటుంది. జన ఔషధి షాపుల్లో అయితే కొంత మేర రాయితీ ఇస్తున్నారు. మామూలు షాపుల్లో అయితే 10 నుంచి 15 శాతం రాయితీపై అమ్మేస్తున్నారు.
● ఈ మూడు రకాల మందులపై ఎమ్మార్పీ ధరలు ఒకేలా ఉండటం గమనార్హం.
ఎమ్మార్పీని నియంత్రించని ప్రభుత్వం ఫార్మా, జనరిక్ మందుల ఎమ్మార్పీ ఒకటే దీంతో జనరిక్ మందులు అంటగడుతున్న వైనం ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇదే పరిస్థితి మందుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న దోపిడీ
ఇవే నిదర్శనం
యాంటీబయోటిక్ ఆగమంటీన్ 625(పది బిళ్లలు) –ఫార్మ, జనరిక్ రెండింటిపైనా రూ.204 ఉంటుంది. ఆస్పత్రులకు ఫార్మా రూ.100కు వస్తుంది. జనరల్ రూ.60కు ఇస్తుంటారు.
నొప్పులకు వాడే ఎసెక్లోఫెనాక్ ఎమ్మార్పీ రూ.119.60 ఉంటుంది.
ఇవి ఫార్మాలో రూ.40 నుంచి రూ.50కి వస్తుండగా, జనరల్‌లో రూ.25కి ఇస్తారు.
గ్యాస్‌కు వాడే పాంటాప్ 40ఎండీ ఇంజక్షన్ రూ.56.50 ఎమ్మార్పీ ఉంటుంది. ఇవి ఫార్మాలో రూ.25, జనరల్‌లో రూ.10కు వస్తుంటాయి.
ఇలా కంపెనీని బట్టి వాటి ధరలు మారుతుంటాయి. కానీ మార్జిన్ మాత్రం అంతే ఉంటుంది.
ఎమ్మార్పీపై ఎక్కువ అమ్మితేనే చర్యలు
మందుల షాపుల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మితే మేము చర్యలు తీసుకుంటాం. కాలం చెల్లిన మందులు విక్రయించినా, ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించినా చర్యలు తీసుకుంటాం. వాటి మార్జిన్ విషయంలో మాకు సంబంధం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాణాంతక వ్యాధులకు పలు రకాల మందుల ఎమ్మార్పీపై నియంత్రణ విధించింది.
–కె.అనిల్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ మండలి