
మృతి చెందిన మహిళ ఎవరు..?
పెనమలూరు: యనమలకుదురు కృష్ణానది లంకల్లో రెండు రోజుల క్రితం మృతి చెందిన మహిళ ఎవరనేది మిస్టరీగా మారింది. కృష్ణానది లంకల్లో గుర్తు తెలియని మహిళ(40) గాయాలతో మృతి చెంది ఉండటంతో స్థానికుల ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే ఆమె మృతదేహం వద్ద పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందీ, ఎలా చనిపోయిందనేది అంతుపట్టడంలేదు. యనమలకుదురు గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకల్లోకి ఆమెను ఎవరైనా తీసుకు వచ్చారా..లేక హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తెచ్చి పడేశారా.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె దేహంపై పలు గాయాలు ఉండటంతో ఆమెది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదు. మృతురాలు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, లేకపోతే ఇప్పటికే ఫిర్యాదు అంది ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి యనమలకుదురు లంకలకు వచ్చే దారిలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతిచెందిన మహిళను ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
గంజాయి మత్తులో యువకుడి వీరంగం
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో గంజాయి బ్యాచ్‌కు చెందిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. బడ్డీ కొట్టు యజమానిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన మహిళలు, స్థానికులను బ్లేడ్‌తో దాడి చేస్తానని బెదిరించాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు డొంకరోడ్డు మహాత్మాగాంధీ విగ్రహం వీధిలో కోలా వెంకటేశ్వరరావు బడ్డీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్దకు ఆదివారం అదే గ్రామానికి చెందిన బోలెం అమలేష్ అనే యువకుడు మత్తులో ఊగిపోతూ వచ్చి ఒరేయ్..సిగరెట్ ఇవ్వు అంటూ బెదిరించాడు. సిగరెట్లు లేవని సమాధానం చెప్పగా ఒక్కసారిగా అతని పై కర్రతో కాళ్లపై కొట్టి, రాయితో తలపై దాడి చేసి గాయపరిచాడు. వెంకటేశ్వరరావు భయపడి ఇంట్లోకి పారిపోయాడు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి అమలేష్‌ను వారించగా బ్లేడుతో దాడి చేస్తానని వారిపై హెచ్చరించాడు. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.పెద్దసంఖ్యలో మహిళలు వచ్చి ఎదురు తిరగటంతో యువకుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. గాయపడిన వెంకటేశ్వరరావును ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గంజాయి బ్యాచ్ వీరంగం
యనమలకుదురు డొంక రోడ్డులో గత కొద్ది కాలంగా గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నారని స్థానికులు తెలిపారు. రాత్రి సమయాలలో వీరు రెచ్చిపోవటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అఽధికార పార్టీ నేతల మద్దతు ఉందంటూ గంజాయి బ్యాచ్ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. పోలీసులు ఇప్పటికై నా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.