
గోడ కూలి ఆర్టీసీ కండక్టర్ మృతి
జి.కొండూరు: అకాల వర్షానికి కోళ్ల ఫారం గోడ కూలి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన ఘటన జి.కొండూరు శివారులోని పినపాక రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళ్తే...జి.కొండూరుకు చెందిన ఉయ్యూరు మంగారావు(45) ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం విధుల నుంచి వచ్చిన మంగారావు వాకింగ్ చేసేందుకు మరో ఇద్దరు కండక్టర్లతో కలిసి గ్రామ శివారులోని పినపాక రోడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో తీవ్రమైన గాలి, వాన ప్రారంభం కావడంతో ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో పినపాక రోడ్డులోని పాడుబడిన కోళ్లఫారం వద్దకు వచ్చే సమయానికి వాన ఉధృతి పెరగడంతో మంగారావు కోళ్లఫారం షెడ్డు గోడ పక్కన నిలబడ్డాడు. మరో ఇద్దరు కోళ్లఫారం షెడ్డులోకి వెళుతుండగా గోడ కూలి శిథిలాలు మీద పడడంతో మంగారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.