
అన్నదాతకు వెతలు
మునేరుకు కోతలు..
పెనుగంచిప్రోలు: మునేరు పక్కన పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు చెందిన వందల ఎకరాల మామిడి తోటలు, మాగాణి పొలాలు ఉన్నాయి. ప్రతి ఏడాది మునేరుకు వరదలు రావటం భూములు కోతకు గురి కావటం జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో మునేరుకు వచ్చిన భారీ వరదలకు పెద్ద ఎత్తున భూములు కోతకు గురై ఇసుకలో కలిసిపోయాయి. ముఖ్యంగా మునేరు పక్కన ఉన్న మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఏళ్లుగా పెంచిన మామిడి చెట్లతో పాటు భూమి వరదకు కొట్టుకుపోయాయి. వరదకు పెనుగంచిప్రోలు పక్కన విలువైన భూములు కోతకు గురి కావటంతో పాటు ఇసుకలో కలిసిపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరదలకు మునేరు పక్కన 15 హెక్టార్లలో మామిడి తోటలు దారుణంగా దెబ్బతినటంతో పాటు 87.5 హెక్టార్లు భూమి కోతకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు.
రూ.లక్షల్లో ఖర్చు..
ఇప్పటికే ఎంతో భూమి వరదలకు ఇసుకలో కలిసి పోతోందని, ఉన్న భూమిని అయినా రక్షించుకుందామని రక్షణ చర్యలు చేపట్టేందుకు ఖర్చు తలకు మించి భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. రక్షణగా బండరాళ్లను రైతులు జగ్గయ్యపేట చుట్టు పక్కల కొండ ప్రాంతం నుంచి టిప్పర్లలో తెచ్చి తోటలకు రక్షణగా వేసుకుంటున్నారు. దీంతో భూమి కోతలకు గురి కాకుండా రక్షణగా ఉంటుందని రైతులు అంటున్నారు. దీనికోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. కోతలకు గురవుతున్న భూములకు రక్షణగా ప్రభుత్వం గోడలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
మునేరు వరదలకు ఇసుకలో కలిసిపోతున్న విలువైన భూములు గతేడాది వరదలకు భారీగా కోతకు గురైన మామిడి తోటలు రక్షణ గోడలు నిర్మించాలంటున్న రైతులు

అన్నదాతకు వెతలు