
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎం. యతిరాజం కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండి తులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
ఆరోగ్య కేంద్రం సందర్శన
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆరోగ్య కార్యక్రమాల తనిఖీల్లో భాగంగా కృష్ణలంక, భ్రమరాంబపురంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం కృష్ణలంక–7ను, క్షేత్రస్థాయిలో వ్యాధి నిరోధక టీకాల సెషన్ జరిగే ప్రాంతాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఎం.సుహాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య కేంద్రంలోని అన్ని రకాల రిజిస్టర్‌లను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణలంక–7 వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, డీపీఓ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో ముగిసింది. విజయవాడ బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన ఈ వాల్యూయేషన్‌లో 826 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరిలో 92 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 552 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 182 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,70,781 జవాబు పత్రాలకు వాల్యూయేషన్ పూర్తి చేశారు. అందులో తెలుగు–29,805, స్పెషల్ తెలుగు– 1,231, హిందీ–22,737, ఇంగ్లిష్–11,462, లెక్క లు–21,414 భౌతికశాస్త్రం–21,500, బయోలజికల్ సైన్స్–24,390, సోషల్–27,454, సంస్కృతం–8,309, వోకేషనల్–2,479 ఉన్నాయి.
విజయవంతంగా..
జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ‘పది’ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని విజయవంతంగా ముగించామన్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పాట్ కొనసాగిందన్నారు. జిల్లాకు వచ్చిన 1,70,781 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ శాఖకు పంపించినట్లు చెప్పారు.
విజయవాడలో
పోస్టర్లపై నిషేధం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పోస్టర్ రహిత నగరమైన విజయవాడలో బహిరంగంగా పోస్టర్లను అతికించటం, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టటం నిషేధమని నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు నగర సుందరీకరణను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ/ప్రైవేట్ భవనాలు, ప్రహరీలు, ట్రాఫిక్ డివైడర్లు, కరెంట్ పోల్స్, ట్రాఫిక్ ఐల్యాండ్స్, ఫ్లై ఓవర్లు/బ్రిడ్జిలు తదితర ప్రాంతా ల్లో పోస్టర్లను అతికించటాన్ని నిషేధించామని వివరించారు. వివిధ సంస్థలకు చెందినవారు తమ ప్రకటనల నిమిత్తం వాల్ పోస్టర్లను నగరంలో పైన పేర్కొన్న ప్రాంతాలలో పోస్టర్లను అతికిస్తే వారిపై చట్ట రీత్యా (1997 చట్టం) చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకటనదారులు, ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి లక్ష రూపాయల వరకు గరిష్టంగా జరిమానా వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించిన వారితోపాటు వాటిని ప్రింటింగ్ చేసిన వారిని కూడా గుర్తించామని వివరించారు.

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం