
కొండపల్లిలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): హస్త కళాకారుల చేతుల నుంచి జీవం పోసుకుని దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కొండపల్లిలో గురువారం పర్యటించిన ఆయన వన్నెతగ్గని సృజనాత్మక బొమ్మల తయారీకి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. హస్తకళాకారుల సొసైటీ భవనాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పర్యాటక్ హబ్‌గా జిల్లా..
అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయన్నారు. భౌగోళిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతికంగా జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఎక్స్‌పీరియన్స్ భవనంలో మౌలిక వసతులు, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్‌డీవో కావూరి చైతన్య, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొండపల్లి బొమ్మల ఖ్యాతి భావితరాలకు తెలిసేలా ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ