
రావణ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి రావణ వాహనంపై నగర పుర వీధుల్లో విహరించారు. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం మూల మంత్రహవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రావణ వాహనాన్ని అధిష్టించిన ఆది దంపతులకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన ఊరేగింపు కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామా రంగం చౌక్, మొయిన్‌రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. కోలాట బృందాలు, డప్పు కళా కారుల విన్యాసాలతో పాటు దేవస్థాన వాయిద్యాల బృందం, పంచవాయిద్యాలతో వాహనం ముందుకు సాగింది. ఆది దంపతులు నగర వీధుల్లోకి విచ్చేయడంతో స్థానిక భక్తజనం, దుకాణదారులు పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. ఏఈవో చంద్రశేఖర్, దుర్గారావు, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా, భక్తజనులు పాల్గొన్నారు.
కనులపండువగా నగరోత్సవ సేవ