
ధరకు చెల్లిన నూకలు
బస్తా రూ.1500 చొప్పన విక్రయించా
నేను రెండు ఎకరాల్లో దాళ్వా సాగు చేశాను. వరి కోసి ధాన్యం అరబెట్టినప్పటికీ కొనేవారు లేక ప్రయివేటు వ్యాపారులకు 75 కిలోల బస్తా రూ.1500 చొప్పున విక్రయించా. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉంటే బస్తాకు రూ.240 అదనంగా ధర వచ్చేది. రెండు ఎకరాలకు రూ.70 వేల పెట్టబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాను.
– జూపల్లి సుబ్బారావు, రైతు, పైడూరుపాడు,
విజయవాడరూరల్ మండలం
ధాన్యం కొనే నాథుడే లేడు
నేను తొమ్మిదెకరాల్లో దాళ్వా సాగు చేశాను. రూ.3.5 లక్షల పెట్టుబడి పెట్టాను. పంట మంచిగా పండింది అనుకుంటే ధాన్యం కొనేవారు లేరు. మా గ్రామానికి పది వేల సంచులు అవసరమైతే వెయ్యి సంచులు ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టి సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేందుకు ఎవరూ రావడంలేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
– కాగితపు వెంకటేశ్వరరావు, రైతు, పైడూరుపాడు,
విజయవాడరూరల్ మండలం
జి.కొండూరు: అన్నదాతకు ఆపద వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అధిక తేమ, బియ్యంలో నూకలు వస్తున్నాయంటూ మిల్లర్లు ధర తగ్గించేశారు. ప్రకృతి కూడా సహకరించకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు వచ్చినకాడికి తెగనమ్ముతున్నారు. ఖరీఫ్ పంటను వరదలు ముంచేశాయి. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు రబీలో వరి సాగుచేసిన రైతులకు మిల్లర్ల మాయాజాలంతో కష్టాలు తప్పడంలేదు. తమకు మద్దతు ధర దక్కేలా చూడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని రైతులు వాపోతున్నారు.
రైతులకు దక్కని మద్దతు
ఎన్టీఆర్ జిల్లాలో రబీ సీజన్‌లో 19,985 హెక్టార్లలో వరి సాగైంది. ప్రభుత్వం 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా ధర రూ.2,320, 75 కేజీల బస్తా ధర రూ.1740గా నిర్ణయించింది. జి.కొండూరు, విజయవాడరూరల్ మండలాల రైతులు ధాన్యం విక్రయించేందుకు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17 శాతానికి తక్కువగా ఉంటే కొనుగోలు చేస్తారు. రైతులు రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టి తేమ 16 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే మిల్లర్లు అనేక సాకులతో వేధిస్తున్నారు. మిల్లర్లు, ప్రయివేటు వ్యాపారులు, సహకార సొసైటీల సిబ్బంది ఏకమై ధాన్యంలో తేమ ఎక్కువ ఉందని, ధాన్యం ముక్కలవుతోందని సాకులు చూపి మద్దతులో కోత విధిస్తున్నారు. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న 75 కిలోల ధాన్యం బస్తాను రూ.1740కి కొనుగోలు చేయాలి. అయితే రూ.1500 నుంచి రూ.1600లోపే మిల్లర్లు ధర చెల్లిస్తున్నారు. 17 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే బస్తాకు రూ.1300లకు మించి ధర ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చి సాయంత్రం సమయానికి వర్షపు జల్లులు పడుతుండటంతో చేసేది లేక రైతులు వచ్చిన కాడికి ధాన్యాన్ని తెగనమ్ముతున్నారు. కొన్ని గ్రామాల్లో గన్నీ సంచుల కొరత ఉందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మిల్లర్ల మాయాజాలంతో ధాన్యం రైతుల గగ్గోలు అధిక తేమ శాతం, బియ్యం ముక్కలవుతోందంటూ ధర తగ్గించిన మిల్లర్లు ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడి కల్లాల్లోనే పేరుకుపోయిన ధాన్యం నిల్వలు వాతావరణంలో మార్పులతో ఆందోళనలో అన్నదాతలు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికి సేకరించిన ధాన్యం 7,200 టన్నులు మాత్రమే..
అంకెల్లో ఇలా..
రబీ వరి సాగు విస్తీర్ణం : 19,985 హెక్టార్లు
ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం : 50 వేల టన్నులు
ఎకరాకు ప్రభుత్వం కొనే ధాన్యం : 39.2 క్వింటాళ్లు
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు : రూ.2,320
ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య: 107
ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు : 34
శుక్రవారం వరకు సేకరించిన ధాన్యం : 7,200 టన్నులు
ధాన్యం సేకరిస్తున్న మిల్లుల సంఖ్య: 16
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు మారత కృష్ణారావు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలంలోని కవులూరుకు చెందిన ఈ రైతు రబీలో 2.4 ఎకరాల్లో వరి సాగు చేశారు. వారం క్రితం రెండెకరాల్లో కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి స్థానిక సొసైటీని సంప్రదించారు. 75 కిలోల ధాన్యం బస్తా ప్రభుత్వ మద్దతు ధర రూ.1,740 కాగా రూ.1,620కే కొనుగోలు చేస్తా మని సొసైటీ సిబ్బంది చెప్పారు. అదేమని అడిగితే ఇష్టమైతే అమ్ముకో లేదంటే ఉంచుకో అని చెప్పడంతో చేసేది లేక వచ్చిన ధరకే పంటను తెగనమ్మారు. తక్కువ ధరకు విక్రయించడంతో రూ.9 వేలకు పైగా నష్టపోయినట్లు కృష్ణారావు వాపోయారు.

ధరకు చెల్లిన నూకలు

ధరకు చెల్లిన నూకలు

ధరకు చెల్లిన నూకలు