
ముగిసిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న చైత్రమాస బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆదివారం ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి చేశారు. ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరవగా స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వసంతోత్సవాన్ని వైభవంగా చేశారు. అర్చకులు, సిబ్బంది, ఆలయ అధికారులు ఒకరిపై మరొకరు రంగులు, గులామ్‌లు చల్లుకుంటూ మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్ర కృష్ణానదికి తరలివచ్చారు. దుర్గాఘాట్‌లో శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అవభృత స్నానాలు జరిపించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు.
ఆది దంపతుల నదీ విహారం
శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లు ఆదివారం పవిత్ర కృష్ణానదిలో విహరించారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపు పురస్కరించుకొని దుర్గాఘాట్ సమీపంలోని వీఐపీ స్నానఘాట్ వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పడవపై ఆది దంపతుల నదీవిహారాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. ముల్లోకాలకు గుర్తుగా మూడు పర్యాయాలు నదీలో మూడు పర్యాయాలు విహరించారు.

ముగిసిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు