కబ్జాకోరులు | - | Sakshi
Sakshi News home page

కబ్జాకోరులు

Published Mon, Apr 14 2025 1:44 AM | Last Updated on Mon, Apr 14 2025 1:44 AM

కబ్జా

కబ్జాకోరులు

● ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల స్థలంపై పెద్దల కన్ను ● స్థలం విలువ రూ.300 కోట్లపైనే.. ● ఎకరానికిపైగా ప్రైవేటు పాఠశాలకు! ● తెరవెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధి..

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన స్థలంపై పెద్దల కన్ను పడింది. నగరం నడిబొడ్డున ఉన్న ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీకి చెందిన రూ. 300 కోట్ల విలువైన 6.67 ఎకరాల స్థలం కబ్జా కోరల్లో చిక్కుకుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు మరి కొందరు బడా నేతల అండదండలతో ఆ స్థలంలో పాగా వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లతో ఓ ప్రైవేటు పాఠశాలకు ఎకరంపైగా స్థలం కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరి కొందరు పెద్దలు కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.

గులాబీతోటలో 6.67 ఎకరాలపై..

మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బీఆర్టీఎస్‌ రోడ్డు సమీపంలోని గులాబీతోటలో 6.67 ఎకరాల స్థలం ఉంది. 1958లో నూజివీడు రాజావారు కళాశాలకు ఈ స్థలాన్ని దానంగా ఇచ్చారు. దీన్ని కొందరు ఏడాదికి రూ.150 చొప్పున లీజుకు తీసుకున్నారు. కొంతకాలం సక్రమంగా లీజు చెల్లించిన లీజుదారులు ఆ తర్వాత కౌలుదారీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కళాశాల స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కళాశాల యాజమాన్యం దీనిపై కేసు వేశారు. హైకోర్టు 2009లో సెటిల్‌మెంట్‌ కోర్టులో తేల్చుకోవా లంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై లీజుదారులు స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

పూర్వ విద్యార్థుల పోరాటం

ఈ కళాశాలలో చదువుకొని దేశ, విదేశాల్లో స్థిరపడిన కళాశాల పూర్వ విద్యార్థులు స్థలాన్ని కాపాడుకొనేందుకు రంగంలోకి దిగారు. రాజకీయాలకు అతీతంగా వారు పోరాటం ప్రారంభించారు. ఆ స్థలంలో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వబోమంటూ ఇప్పటికే ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలను సైతం అందజేశారు.

అమలు కాని హామీ..

కళాశాల స్థల వివాద విషయంలో నాటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ స్థలాన్ని సందర్శించారు. ఇది ముమ్మాటికీ కళాశాల స్థలమని, ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కళాశాల నుంచి ఇక్కడ వరకు రైవస్‌ కాల్వపై ఫుట్‌బ్రిడ్జి సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఫుట్‌బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు కొలతలు తీయటంతో పాటు రూ.1.25 కోట్ల వ్యయ అంచనా తయారు చేశారు. కానీ బ్రిడ్జి పనులు ప్రారంభం కాలేదు.

క్రయవిక్రయాలు చేయరాదంటూ బోర్డులు

నూజి వీడు రాజావారు సొంత ఆస్తులను కాకుండా జాగీరు భూమిని కొనుగోలు చేసి కళాశాలకు స్థలం అందజేశారు. దీంతో కౌలుదారీ చట్టం వర్తించదని పూర్వ విద్యార్థులు పేర్కొంటున్నారు. 2017లో హైకోర్టులో కేసు ఉన్నా కళాశాల స్థలంలో నిర్మాణాలు, క్రయ, విక్రయాలు చేసేందుకు సిద్ధపడ్డారు. నాటి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెలగా జోషి, పూర్వ విద్యార్థులు, కళాశాల విద్యార్తులతోకలిసి ఆ స్థలంలో ఆక్రమణలను అడ్డుకున్నారు. ఈ స్థలం క్రయ విక్రయాలు చేయరాదంటూ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వమే కాపాడాలి

కళాశాలకు ఎంతో చరిత్ర ఉంది. దీని అభివృద్ధికి దాతలు విలువైన స్థలం ఇచ్చారు. కాలక్రమేణా ఆక్రమించుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పూర్వ విద్యార్థులుగా అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నాం. కోర్టుల్లో కేసులు వేశాం. విద్యాశాఖ మంత్రి అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదు. విలువైన కళాశాల స్థలాన్ని ప్రభుత్వమే కాపాడాలి. ఇప్పటికే జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి.

– దోనేపూడి శంకర్‌, పూర్వ విద్యార్థి

విద్యార్థులతో కలిసి..

ఎంతో మంది మేధావులను తయారు చేసిన కాలేజీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించటం విచారకరం. 6.67 ఎకరాలు న్యాయపరంగా కళాశాలకు చెందు తుంది. ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నాం. కళాశాల సిబ్బంది, విద్యార్థులతో కలిసి స్థలాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నాం.

– లంకా జానయ్య,

కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేత

కళాశాలకు చెందిన స్థలమిది

6.67 ఎకరాలు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు చెందిన స్థలం. దాతల ఆశయాలకు అనుగుణంగా ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా విద్యార్ధులతో కలిసి పనిచేస్తున్నాం. నిజానిజాలు వెలికి తీసి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ స్థలం భావితరాలకు ఉపయోగపడటానికి కృషి చేస్తున్నాం.

–డాక్టర్‌ వెలగా జోషి, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌

తప్పుడు రిజిస్ట్రేషన్లు

స్ధల వివాదం కోర్టులో ఉన్నా ఇటీవల కొందరు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి.. ఇతర నేతలు ఆక్రమణ దారులకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రజాప్రతినిధి ఇక్కడ నిర్మాణాలు చేసుకోవచ్చంటూ భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. నగరంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎకరం స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు ప్రముఖులు కళాశాల స్థలాన్ని దక్కించుకొనేందుకు చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ క్రయ విక్రయాలు చేయవద్దంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు.

కబ్జాకోరులు 1
1/3

కబ్జాకోరులు

కబ్జాకోరులు 2
2/3

కబ్జాకోరులు

కబ్జాకోరులు 3
3/3

కబ్జాకోరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement