
మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు
తిరువూరు: తిరువూరు డివిజన్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మొక్కుబడి తంతుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 41 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంతవరకు కేవలం 2,222 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గతవారం రోజులుగా భారీ వర్షాల కారణంగా వరిధాన్యాన్ని త్వరితగతిన విక్రయించడానికి రైతులు ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో స్పందన కరువైంది. అవసరానికి తగినట్లు ఖాళీ సంచుల సరఫరాలో సైతం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రైతులకు మాత్రమే ఈ కేంద్రాల్లో ధాన్యం విక్రయించే అవకాశం లభిస్తోందని, చిన్న రైతుల్ని పట్టించుకోవట్లేదని గంపలగూడెం మండలంలో పలువురు రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కంటే ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు, దళారులకు విక్రయించడమే సులువని రైతులు భావిస్తున్నారు.
సిబ్బందిలో నిర్లక్ష్యం..
క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రైతులు తమ కల్లాల్లోని ధాన్యాన్ని విక్రయించడానికి ముందుకు వచ్చినా తేమశాతం పరిశీలించడానికి, ధర నిర్ణయించడానికి తమకు తీరిక లేదన్నట్లు పీపీసీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని సిబ్బంది చెబుతుండగా, కల్లాల్లోనే తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని తిరువూరు ఆర్డీవో ఆదేశించారు. ప్రైవేటు వ్యాపారులు తిరువూరు డివిజన్లో 2,300 టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. డివిజన్లోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను గురువారం మరోసారి పరిశీలించిన తిరువూరు ఆర్డీవో మాధురి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.