
బ్రాహ్మణ సామాజికవర్గంపై ప్రభుత్వ దాష్టీకం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మ ణ సామాజికవర్గంపై దాష్టీకాలు అధికమయ్యాయని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై కక్ష పూరితంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజకీయ కక్ష సాధింపులతో కుట్రపూరితంగా అక్రమ కేసులో సస్పెండ్ చేసి, సంధ్యా వందనం చేసుకోవటానికి కూడా సామాన్లు అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆత్మగౌరవంపైనా.. అప్పటి ప్రభుత్వం దాడి చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును ఏ విధంగా అవమానపర్చారో చూశామన్నారు.
శారదా పీఠంపై ఎందుకంత కక్ష....
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో శారదా పీఠంకి గత వైఎస్సార్ సీపీ సర్కార్ కేటాయించిన 15 ఎకరాలను కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు భూమి ఇవ్వాలని శారదాపీఠం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని కోరగా, అప్పటి ప్రభుత్వం స్పందించి కొత్తవలసలో భూమి కేటాయించిందని చెప్పారు. కానీ ప్రభుత్వం మారిన వెంటనే కేటాయింపులను రద్దు చేయటంతో పాటు వేరే కంపెనీకి ఎకరా కేవలం రూపాయికే కేటాయించటం గమనార్హమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే శారదా పీఠం పైన, స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష సాధింపు అని ప్రశ్నించారు. తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకి అప్పగించాలని, టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేయటంపై భక్తులు మండిపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకులు, పురోహితులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. అర్చకులకు సరైన రక్షణ కల్పించి కఠినమైన చట్టాన్ని రూపొందించాలని కోరారు.
వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు