అయ్యో.. ఎంత ఘోరం..! ముగ్గురు ఒకేసారి ఇలా.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు.. వారి పాలిట మృత్యు పాశాలు..

Published Fri, Aug 4 2023 1:48 AM | Last Updated on Fri, Aug 4 2023 12:44 PM

- - Sakshi

ఒడిశా: విద్యుత్‌ తీగలు వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. ఇనుప రాడ్‌ రూపంలో ప్రాణాలను కబళించాయి. ఎప్పటిలా కాకుండా ముందుగా ప్రారంభిద్దామనుకున్న పనే వారి పాలిట శాపమైంది. విద్యుత్‌ షాక్‌ రూపంలో ముగ్గురిని బలి తీసుకుంది. కుటుంబీకులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. హృదయ విదారకమైన ఈ ఘటన సంతకవిటి మండలం సోమన్నపేటలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు..

సంతకవిటి మండలం సోమన్నపేట గ్రామంలో గురువారం విద్యుత్‌ షాక్‌కు గురై గ్రామానికి చెందిన పాండ్రంకి కేసరినాయుడు(24), గండ్రేటి చంద్రశేఖర్‌(18), దూబ రెయ్యమ్మ(57) మృతి చెందారు. పాండ్రంకి రామినాయుడు ఇంటి మొదటి అంతస్తు నిర్మాణ పనుల్లో భాగంగా అతని కుమారుడు కేసరినాయుడు, అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు గండ్రేటి చంద్రశేఖర్‌ను పనికి పిలిచి డాబా ఎక్కారు.

ఆ సమయంలో డాబా మీద ఉన్న 12 ఎంఎం ఇనుప రాడ్‌ను డాబా వెనుక వైపు నెట్టగా, డాబాకు కొద్ది దూరంలో ఉన్న 230 ఓల్ట్స్‌ విద్యుత్‌ సరఫరా తీగలకు రాడ్‌ తగలడంతో రాడ్‌ను పట్టుకున్న ఇద్దరు యువకులు పెద్దగా కేకలు వేస్తూ మృతి చెందారు. డాబా మీద యువకుల అరుపులను ఎదురుగా ఉన్న అంగన్‌వాడీ ఆయా దూబ రెయ్యమ్మ విని వెంటనే డాబా పైకి వెళ్లి పొరపాటున ఇనుప చువ్వను ముట్టుకోవడంతో ఈమె కూడా మృతి చెందింది.

ఈ విషయాన్ని గమనిస్తున్న ఒకరిద్దరు ఏదో జరుగుతుందని ఊహించి డాబా ఎక్కకుండా పొలాల్లో ఉన్న కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రామంలోకి వచ్చిన కిరాణా సరుకుల రవాణా వ్యాపారి డోల ప్రసాద్‌ డాబా వెనుక వైపునకు వెళ్లి ఇనుప రాడ్‌ స్ట్రీట్‌ లైన్‌ విద్యుత్‌ తీగలకు తగిలి ఉండడాన్ని గమనించి ఎలక్ట్రికల్‌ ఏఈకి వెంటనే ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేయించారు.

అనంతరం డాబా ఎక్కి ముగ్గురు పడి ఉండడాన్ని గమనించి వారిని కిందకు దించారు. ముగ్గురిలో చంద్రశేఖర్‌ కొన ఊపిరితో ఉన్నాడనే అనుమానం రావడంతో వెంటనే ప్రైవేట్‌ వాహనంలో సంతకవిటి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. వీఆర్‌వో కనకమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజాం రూరల్‌ సీఐ సీహెచ్‌ ఉపేంద్ర, సంతకవిటి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సిరిపురపు జగన్మోహనరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం..
సోమన్నపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత పొగిరి సత్యంనాయుడుతో పాటు సంతకవిటికి చెందిన జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సిరిపురపు జగన్మోహనరావులకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకున్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో వైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు చేపట్టాలని ఎలక్ట్రికల్‌ అధికారులకు ఆదేశించారు. సంఘటనా స్థలానికి విద్యుత్‌ శాఖ రాజాం డీఈఈ జీవీ రమణ, ఏఈలు కుమార్‌, సయ్యద్‌లు చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.

ముగ్గురి జీవితాల విషాద గాధ..
ఈ ఘటనలో మృతి చెందిన పాండ్రంకి కేసరినాయుడు తల్లి చిన్నమ్మడు ఆరు నెలలు క్రితమే మృతి చెందింది. కేసరినాయుడుతో పాటు తండ్రి రామినాయుడు, సోదరుడు కోటిబాబు కలసి ఉంటున్నారు. కేసరినాయుడు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్నాడు. అన్నయ్య విశాఖపట్నంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఊరికి వచ్చిన తన సోదరుడు బుధవారం విశాఖపట్నం వెళ్లిపోయాడు. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరు నెలల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడం స్థానికులను కన్నీరు పెట్టించింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన గండ్రేటి చంద్రశేఖర్‌ కుటుంబానిది మరో విషాద గాధ. గండ్రేటి కేసరి, సూరీడమ్మలకు చంద్రశేఖర్‌ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు రాజాంలో నాగావళి ఐటీఐలో ఫిట్టర్‌ కోర్సులో చేర్పించారు. గురువారం కళాశాల ఉన్నప్పటకీ స్నేహితుడు కేసరినాయుడు ఇంటి పనికి వచ్చాడు. మృత్యువులో కూడా స్నేహితునితో కలసి వెళ్లిపోయాడు. తమ కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు మాకెందుకు ఈ జీవితం అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన దూబ రెయ్యమ్మ ఒక్కర్తే ఉంటున్నారు. ఈమెకు భర్త లేరు. గ్రామంలో అంగన్‌వాడీ ఆయాగా ఉంటూ కాలం నెట్టుకొస్తుంది. ఈమెకు ఒక్క కుమార్తె భవానీ కాగా ఆమెకు పెళ్లి చేసి, తానొక్కర్తే జీవనం సాగిస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు ఏమి జరిగిందో తెలుసుకుని వారిని కాపాడేందుకు డాబా ఎక్కి మృత్యువాత పాడింది. ఈమె మృతిని కుమార్తె జీర్ణించుకోలేక బోరున విలపిస్తుంది.

మిగిలిన వారి ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురు..
ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరింత మంది మృత్యువాత పడే ప్రమాదం ఘటనా స్థలంలో నెలకొంది. అయితే విద్యుత్‌ ఎర్త్‌ అవుతుందని అనుమానం వచ్చిన స్థానికురాలు నగిరి పద్మ మిగిలిన వారిని డాబా ఎక్కనీయకుండా అడ్డుకుంది. లేకుంటే మరో ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు.

గ్రామంలోకి వచ్చిన కిరాణా రవాణా వ్యాపారి డోల ప్రసాద్‌ డాబా ఎక్కుతుండగానే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అవుతుందని గమనించి డాబా వెనుక వైపు వెళ్లి స్ట్రీట్‌ లైన్‌కు ఇనుపరాడ్‌ డాబా మీద నుంచి ఉన్నట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేయించి ప్రాణ నష్టాన్ని నివారించాడు.

ఇంకో వైపు విద్యుత్‌ తీగలు మధ్య ఉన్న రాడ్‌ను గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు గుర్తించి, వెంటనే అక్కడకు వచ్చి ఎదురు కర్రతో రాడ్‌ను తొలగించి పెద్ద ప్రమాదాన్నే తప్పించారు. లేకుంటే విద్యుత్‌ సరఫరా డాబా మీదకు వస్తుందని చెబుతున్నప్పటకీ కొంతమంది ఆత్రుతతో డాబా ఎక్కే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్‌ విద్యుత్‌ తీగల నుంచి తప్పించకుంటే ప్రమాదం ఇంకా పెద్దదయ్యేది. మరింత ప్రాణ నష్టం జరిగేది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement