ఒడిశా: హోంగార్డు అనుమానాస్పద మృతి ఘటనలో జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ ఆదేశాల మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసిన మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పుటాసింగి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అవినాష్ లిమ్మ(33) సోమవారం రాత్రి అనుమనాస్పద రీతిలో పుటాసింగిలోని ఓ మండపంపై శవమై కనిపించాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.
దీనిపై పోలీసు శాఖ నుంచి సరైన స్పందన లేకపోవడంతో మతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిన లిమ్మ కుటుంబీకులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. విషయం జిల్లా ఎస్పీ వివేకానంద శర్మ దృష్టికి వెళ్లడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఎలా అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతికి గల పూర్తి కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిని గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. పూడ్చి పెట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో లిమ్మ కుటుంబీకులు, గ్రామస్తులు దీనిపై వ్యతిరేక వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి, మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అనంతరం గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించి, భద్రపరిచారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. అయితే ఇది హత్య? లేక సహజ మరణమా అనే వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment