తెరుచుకున్న జగన్నాథుని రత్న భాండాగారం
వెలుపలి గదుల్లోని ఆభరణాలు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలింపు
నీలాద్రి విజే తర్వాత మలి విడత లెక్కింపు జగన్నాథ స్మరణతో వెళ్లాం
భువనేశ్వర్: దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. పూరీలోని జగన్నాథుని రత్న భాండాగారంలో సంపద లెక్కింపు ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రారంభమైంది. రత్న భాండాగారం తనిఖీ పర్యవేక్షక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో 11 మంది ప్రముఖులు శుభఘడియల్లో రత్న భాండాగారం లోపలికి ప్రవేశించారు. వీరిలో పూరీ జిల్లా కలెక్టర్, భారత పురావస్తు శాఖ సూపరింటెండెంట్, రత్న భాండాగారం సబ్ కమిటీ సభ్యుడు, పర్యవేక్షక ప్యానెల్ నుంచి ఇద్దరు సభ్యులు, గజపతి మహారాజు ప్రతినిధి, సేవకుల సంఘం నుండి నలుగురు ప్రతినిధులు ఉన్నారు.
తొలి రోజు ఇలా..
సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా తెరుచుకోని రత్న భాండాగారంలో అన్ని గదుల్ని ఏక విడతలో తెరిచి సమగ్ర సంపదని లెక్కించడం అసాధ్యం. తొలి రోజున వెలుపలి భాండాగారం తెరిచి దానిలోని సంపదని శ్రీ మందిరంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. వెలుపలి గది పని పూర్తి కావడంతో లోపలి గది తెరిచే సరికి వేళ దాటింది. ఒకసారి గదిలోని సంపదని తాకితే నిరవధికంగా సమగ్ర సంపదని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కానందున తొలి రోజున నామ మాత్రపు పర్యవేక్షణతో పని ముగించారు. లోపలి గదిలో పలు చెక్క పెట్టెలు, బీరువాలు, సొరుగుల్లో రత్న సంపద ఉన్నట్లు గుర్తించారు. జగన్నాథుని మారు రథయాత్ర నీలాద్రి విజే తర్వాత రత్న భాండాగారం పర్యవేక్షణ మలి విడత తేదీ ప్రకటిస్తారు.
కట్టుదిట్టమైన నియమావళి
లెక్కింపు సందర్భంగా ఆలయ ప్రధాన పాలనాధికారి సీఏఓ డాక్టరు అరవింద కుమార్ పాఢి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన నిర్ధారిత కార్యాచరణ నియమావళి(ఎస్‌ఓపీ)ని పకడ్బందీగా అమలు చేశారు. రత్న భాండాగారం తెరిచి శ్రీమందిరం సింహద్వారం మినహా మిగిలిన 3 ద్వారాల్ని మూసి వేశారు. తనిఖీ కోసం లోనికి ప్రవేశించే సభ్యులను బెహెరాన్ ద్వారం సమీపంలో తనిఖీ చేసి అనుమతించారు. ఈ ప్రక్రియనంతా వీడియో తీశారు.
తాళాలు విరగ్గొట్టి..
గతంలో రత్న భాండాగారం తాళం చెవి గల్లంతైంది. తదుపరి దశలో నకిలీ తాళం చెవిలు లభ్యమైనట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. దీర్ఘకాలంగా లోపలి భాండాగారం తెరవనందున నకిలీ తాళం చెవిలతో తలుపులు తెరవలేని పరిస్థితుల్లో విరగొట్టాల్సిందేనని తనిఖీ పర్యవేక్షణ ఉన్నత స్థాయి కమిటీ ఎస్‌ఓపీలో పేర్కొంది. ఈ క్రమంలో ఆదివారం రత్న భాండాగారం తెరిచే ప్రయత్నంలో కలెక్టర్ అందజేసిన తాళం చెవి పనిచేయకపోవడంతో ఫోరెన్సిక్ నిపుణులతో మేజిస్ట్రేట్, కలెక్టర్ సమక్షంలో తాళాలు విరగ్గొట్టారు. 3 తాళాల్లో ఒకటి మాత్రమే సీలు వేసి ఉండగా మిగిలిన రెండు తాళాలకు సీలు లేనట్లు గుర్తించారు. 2 కొత్త తాళాలతో లోపలి గది మూశారు. ఈ రెండు తాళాలు సీలు చేసి తాళం చెవులను జిల్లా కలెక్టరుకు అప్పగించి ట్రెజరీలో భద్రపరిచేలా ఆదేశించారు.
సంప్రదాయం ప్రకారం..
శ్రీ మందిరం రత్న భాండాగారం యజమాని శ్రీ మహాలక్ష్మి. సంరక్షకురాలు విమలా మాత, ప్రధాన రక్షకుడు లోకనాథ మహాప్రభువు. ప్రభువు నుంచి ఆజ్ఞామాల రావడంతో సభ్యులు శ్రీ మందిరంలోనికి అడుగిడారు. తొలుత మహా లక్ష్మి, విమలా మాతని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి నుంచి అనుమతి పొందిన తర్వాత తలుపులు తెరిచారు.
భారీ చెక్క పెట్టెల తరలింపు..
రత్న భాండాగారంలో స్వామి ఆభరణాలు భద్రపరిచేందుకు పూరీకి 6 భారీ చెక్క పెట్టెలు తరలించారు. వీటిని టేకు కలపతో తయారు చేసి లోపల నలువైపులా ఇత్తడి తాపడంతో సిద్ధం చేశారు. ఒక్కో పెట్టె 4.5 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు, రెండు అడుగుల లోతు పరిమాణంతో తయారయ్యాయి. స్వామి యాత్ర సందర్భంగా వినియోగించే పెట్టెల్ని ఇవి పోలి ఉన్నాయి. రత్న భాండాగారంలో సమగ్ర సంపద భద్రపరిచేందుకు మొత్తం 15 చెక్క పెట్టెలు అవసరం ఉంటుందని అంచనా. ఈ మేరకు తయారీ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశ పనుల కోసం 6 పెట్టెల్ని సిద్ధం చేశారు.
పాముల భయం లేదు..
దశాబ్దాల తర్వాత రత్న భాండాగారం తెరుస్తున్నందున పాములు నిండి ఉంటాయని సోషల్ విస్తృత ప్రచారం జరగడంతో స్నేక్ హెల్ప్‌లైన్, ఓడ్రాఫ్ దళాల్ని సిద్ధం చేశారు. అయితే రత్న భాండాగారం లోపల పాముల భయం లేనందున స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణుడు సువేందు మల్లిక్ ఆధ్వర్యంలో బృందం వెనుదిరిగింది. ఆకస్మిక అవసరాల దృష్ట్యా ఈ బృందాన్ని శ్రీ మందిరం ఆవరణలో అందుబాటులో ఉంచారు. లోపలికి మాత్రం అనుమతించ లేదు.
గబ్బిలాల అలికిడి..
రత్న భాండాగారం తెరవడంతో గబ్బిలాలు పెద్ద సంఖ్యలో అలికిడి చేశాయి. ఒక్కసారిగా బయటకు ఎగిరి వచ్చాయి. ఈ పక్షులు శ్రీ మందిరం సింహద్వారాన్ని అనుసంధాన పరిచే 22 పావంచాల మార్గంలో బయటకుఎగిరి పోయాయి.
ఎస్పీపై వదంతులు..
రత్న భాండాగారం తెరిచిన కాసేపటికి భద్రతా వ్యవస్థ పర్యవేక్షకుడు, పూరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పినాకి మిశ్రా అస్వస్థతకు గురై సొమ్మసిల్లినట్లు పుకారు వ్యాపించింది. ఈ వార్తని సేవాయత్ ప్రతినిధి ఒకరు ప్రసారం చేయడంతో కాసేపు కలకలం రేగింది. తక్షణమే ఎస్పీ స్వయంగా మీడియా ముందు హాజరై వదంతులు నమ్మవద్దని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు.
రత్న భాండాగారం లోపల పరిస్థితి సాధారణంగానే ఉంది. మాలో ఎవరికీ ఎటువంటి శారీరక , మానసిక ఇబ్బంది కలగలేదు. అందరూ జగన్నాథుని నామస్మరణ చేస్తూ లోపలికి వెళ్లాం.కొన్ని చెక్క పెట్టెలు (2), కొన్ని బీరువాలు ( 5), ఇతర వస్తువులు ఉన్నాయి. వెలుపలి గది నుంచి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచేందుకు సుమారు 3 గంటలు నిర్విరామంగా శ్రమించాల్సి వచ్చింది.
– జస్టిస్ బిశ్వనాథ్ రథ్
Comments
Please login to add a commentAdd a comment