
పూరీ: ఒడిశాలోని పూరిలో గల జగన్నాథ ఆలయంలో కలకలం చెలరేగింది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆలయంలో నిత్యం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా జరిగిన ఒక ఉదంతం ఆలయ భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నాడు. దీనిని చూసినవారంతా షాకయ్యారు. సాయంత్రం వేళ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గోపురంపైకి ఎక్కిన వ్యక్తిని చూసిన ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు.
పూరీలోని శ్రీ మందిరం చుట్టూ గట్టి భద్రతా వలయం ఉంది. దీనిని తప్పించుకుని ఆ వ్యక్తి ఆలయంపైకి ఎలా ఎక్కగలిగాడనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. కాగా శిఖరాన్ని అధిరోహించిన ఆ వ్యక్తి పైననే కొద్దిసేపు ఉన్నాడు. ఆలయ అధికారులు అతనిని కిందకు తీసుకువచ్చారు. తరువాత పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్‌నకు చెందినవాడినని తెలిపాడు. 1988 నుంచి తాను ఆలయానికి వస్తున్నానని, తన కోరిక ఒకటి నెరవేరాక, ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి, అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: గణపతి నిమజ్జనంలో ఉద్రిక్తత