దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది రేపే తెరుచుకోనుంది.ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి.
ఆదివారం పూరీలోని ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు.
46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. అయితే.. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భండారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సేవకుడు హరేకృష్ణ మహాపాత్ర అంటున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించారు కూడా.
👉పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు.
👉అయితే.. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
👉భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.
👉ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే.. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘుబీర్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది.
👉జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు లభించాయి.
👉కాగా, 1978లో జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు లభించాయి. 1982 – 1985 సంవత్సరాలలో రత్న భండాగారం తెరచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు.
👉జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.
👉రఘుబీర్ కమిటీ నివేదికపై జులై 10లోగా స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. రాజకీయం చేయొద్దని బీజేడీ కోరినా.. బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి తగ్గలేదు. అయితే ఈలోపే ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో తొలిసారి అధికారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిపించేందుకు సిద్ధమైంది.
👉ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో.. ఈ నెల 14న(ఆదివారం) రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి ఆ కమిటీ సిఫార్సు చేసింది.
👉జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను బిశ్వనాథ్ కమిటీనే తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పజెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో.. రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment