జయపురం: రాష్ట్రంలో అధికార బీజేపీ చర్యలను ఖండిస్తూ ఈ నెల 27న విధాన సభ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిందని ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. స్థానిక బాబాసాహేబ్ కల్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శశిభూషణ పాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాహిణీపతి ప్రసంగిస్తూ బీజేపీ పాలకులపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అందుకు ముఖ్యమంత్రి సభకు సమాధానం చెప్పాలని తాను డిమాండ్ చేసినందుకు బిజేపి ఎం.ఎల్.ఎ జయనారాయణ మిశ్ర తన పై దాడి చేశారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు కొరాపుట్ జిల్లా నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఈ నెల 27న విధాన సభ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ మంత్రులను, నేతలను కొరాపుట్ జిల్లాలోనికి అనుమతించకూడదని నేతలు పిలుపునిచ్చారు. ప్రసంగించిన వారిలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, ఒడిశా కాంగ్రెస్ ప్రభారీ రజణీ మహంతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకులు అజిత్ దాస్‌తో పాటు కొరాపుట్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బినోద్ మహాపాత్ర, కోశాధి కారి నిహారంజన్ బిశాయి తదితరులు ఉన్నారు.