రాయగడ: తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షుడు గోపి ఆనంద్ స్పష్టం చేశారు. స్థానిక సిరిగుడలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరోపై దురుసుగా ప్రవర్తించానని వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏడీఎంను కలిసి చర్చించిన మాట వాస్తవేమేనని, అయితే ఆ సమయంలో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివరాలను ఒక అధికారిని అడగడం తప్పా అని ప్రశ్నించారు. అలాగే వ్యాపారవేత్తలు, విద్యాసంస్థ యజమానుల వద్ద ఉగాది పేరిట చందాలు దౌర్జన్యంగా వసూళ్లు చేస్తున్నారన్న వచ్చినవి నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. మిల్లర్స్ అసోసియేషన్, జ్యూయలరీ షాప్ యజమానులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనన్నారు. తమపై ఎటువంటి ఒత్తిడి తీసుకొని రాలేదని స్వయాన ఆయా సంస్థలకు చెందినవారు తనకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారని వివరించారు. సమావేశంలో ఆయనతో పాటు బీజేపీ నాయకులు బసంత కుమార్ ఉలక, త్రినాథ్ గొమాంగో, జగన్నాథ నుండ్రుకలు పాల్గొన్నారు.
బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షుడు
గోపి ఆనంద్