విజయనగరం ఫోర్ట్: క్షయవ్యాధి నియంత్రణలో విజయనగరం జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. క్షయ వ్యాధి నియంత్రణ ప్రత్యేక వందరోజుల ఉద్యమంలో దేశంలోనే అత్యధిక క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన జిల్లాగా గుర్తింపు పొందింది. క్షయవ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని 347 జిల్లాల్లో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా వంద రోజుల టీబీ నియంత్రణ కార్యక్రమానికి ఎంపికై ంది. దీనిలో భాగంగా క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, క్షయవ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టారు. వంద రోజుల కార్యక్రమానికి ఎంపికై న 347 జిల్లాల అన్నింటిలో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 45,195 క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ జేపీ నడ్డా నుంచి క్షయ నియంత్రణపై విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర బృందం ప్రతినిధి పి.రమేష్ అవార్డు స్వీకరించారని తెలిపారు. ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి, క్షయ నివారణ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
వైద్యారోగ్యశాఖను అభినందించిన కలెక్టర్ అంబేడ్కర్