శ్రీకాకుళం అర్బన్: ఫేస్‌యాప్ పేరుతో అంగన్‌వాడీల వేతనాలలో కోత విధించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతినెలా ఫేస్ ఎన్‌రోల్‌మెంట్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అధికారులు ఒత్తిడి, వేతనాలలో కోత మానుకోవాలన్నారు. ఇప్పటికే యాప్ మొరాయిస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఎన్నో అవస్థలు పడి పని పూర్తి చేస్తుంటే మరింతగా పనిభారం పెంచడం తగదన్నారు. వేతనాల కోత, మెమోల జారీతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, వి.హేమలత, జె.కాంచన, డి.మోహిని, పి.బాలేశ్వరి, ఎల్.దుర్గ పాల్గొన్నారు.