
సేవా పేపరు మిల్లు కాంట్రాక్ట్ కార్మికుని హత్య
జయపురం: జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధి గగణాపూర్‌లోగల సేవా పేపర్ మిల్లులో కాంట్రాక్టు కార్మికుడిని కొందరు దుండగులు హత్య చేశారు. హతుడిని జయపురం సమితి పంపుణీ గ్రామం పద్మన్ హరిజన్(49)అని గుర్తించారు. సమాచారం అందుకున్న గగణాపూర్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. విషయం జయపురం సదర్ పోలీసులకు తెలియజేశారు. పద్మన్ రోజూ లాగానే ఆదివారం కూడా గగణాపూర్‌లో గల సేవాపేపరుమిల్లుకు పనికి వెళ్లాడు. సాయంత్రం డ్యూటీ అయ్యాక తన బైక్‌పై గ్రామానికి బయల్దేరాడు. గగణాపూర్ నుంచి రాణీపుట్ మార్గంలో గ్రామానికి వెళ్తుండగా బొనగుడ గ్రామం హనుమాన్ మందిరం సమీపంలో ఎవరూ లేని సమయం గుర్తించి కొంత మంది అతడిని చుట్టుముట్టి దాడి చేశారు. అతను విడిపించుకుని పరిగెత్తుకుని వెళ్లిపోయినా విడవకుండా వెంబడించి హతమార్చారు. గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు విషయం చెప్పారు. జయపురం సదర్ పోలీసు అధికారి సచింద్ర ప్రధాన్, మరియు స్వతంత్ర నేర నియంత్రణ అధికారి, మాజీ పట్టణ పోలీసు అధికారి ఈశ్వర చంధ్ర తండి సంఘటన ప్రాంతానికి చేరుకొని పద్మన్ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.