
శాసన సభ బడ్జెట్ సమావేశాలకు తెర
● సభ నిరవధికంగా వాయిదా: స్పీకర్
భువనేశ్వర్: 17వ శాసన సభ మూడో విడతలో బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. మూడు పని దినాలు ఉంటుండగా శాసన సభలో సమావేశాలకు ముందస్తుగా తెర దించేశారు. సభా కార్యక్రమాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకరు సురమా పాఢి ప్రకటించారు. 28 పని దినాల్లో 25 పని దినాలు పూర్తయ్యాయి. సభలో తదుపరి చర్చకు ప్రముఖమైన అంశాలు లేనందున అధికార పక్షం చీఫ్ విప్ సభను నిరవధికంగా వాయిదా వేయాలని ప్రతిపాదించారు. దీనికి అనేక మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
అన్నీ తొలి అనుభవాలే
17వ శాసన సభ మూడవ సమావేశం అత్యంత ఆకర్షణీయంగా జరిగింది. ఈ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం అనునిత్యం కొత్త మలుపులు తిరుగుతు ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో శాసన సభ చరిత్రలో తొలి సారిగా గందరగోళం సృష్టించిన సభ్యుల్ని స్పీకరు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసి సంచలనం రేపారు. స్పీకర్ ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు బలి అయ్యారు. ఆ పార్టీకి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేల్ని స్పీకరు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన కాంగ్రెసు ఎమ్మెల్యేలు సభ బయట నిరవధికంగా నిరసన ప్రదర్శించారు. ఈసారి వీరంతా ఘంటానాదం, తాళాల వాయింపు, వేణు గానం, డోలక్ బజాయింపు వంటి విన్యాసాలతో సభలో గందరగోళ పరిస్థితిని ఆవిష్కరించారు. మరో వైపు ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ శాసన సభ ప్రాంగణం శుద్ధి చేసింది. ప్రజా సమస్యలపై ఉద్యమించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏకపక్ష నిర్ణయంతో సస్పెండు చేయడాన్ని బీజేడీ వ్యతిరేకించింది. ఈ క్రమంలో స్పీకరు భారత రాజ్యాంగం వ్యతిరేక చర్యకు పాల్పడ్డారు. ఈ చర్యతో పవిత్ర సభా స్థలం అపవిత్రమైంది. ఈ అపవిత్రత తొలగించేందుకు విపక్ష బీజేడీ సభ్యులు ఇత్తడి కలశాల్లో గంగా జలం సభా ప్రాంగణానికి తీసుకుని వచ్చి సభ ప్రాంగణం నలు మూలలా శుద్ధి చేసి శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు. బిజూ జనతా దళ్ ఈ విడత సమావేశాల్లో సుమారు నిత్యం నిరసన ప్రదర్శనకు ముందంజ వేయడం గమనార్హం.
రాత్రంతా సభలో సందడే
రాష్ట్ర విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లుపై చర్చలు పురస్కరించుకుని శాసన సభ రాత్రంతా కొనసాగింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ సభ గురు వారం ఉదయం 7.05 గంటల వరకు నిరవధికంగా కొనసాగింది. స్పీకర్ ఆదేశాల మేరకు సభా కార్యకలాపాల నుంచి సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ సభ్యులు రాత్రి అంతా సభ ప్రధాన ప్రాంగణంలో నిరవధికంగా నిరసన ప్రదర్శించారు. రాత్రి పూట అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో శాసన సభ లోపలి నుంచి కాంగ్రెసు సభ్యుల్ని బలవంతంగా బయటకు తొలగించారు. దీంతో మరింత నిరుత్సాహానికి గురైన కాంగ్రెస్ సభ్యులు సభ బయట ఆందోళన ఉధృతపరిచారు. కాంగ్రెసు భవన్ సమీపం మాస్టరు క్యాంటీన్ కూడలి ప్రాంతంలో వీరంతా నడి రోడ్డు మీద రాత్రంతా బైఠాయించి తీవ్ర అలజడి రేపారు. ఈ ఆందోళన ప్రభావంతో పలువురు ఎమ్మెల్యేలు అస్వస్థతకు గురయ్యారు.