
నేడు వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా వినతుల పరిష్కార వేదికలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారని మంత్రి కార్యాలయం ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు నేరుగా మంత్రి స్వీకరిస్తారని, ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కోరారు.
ఆటో బోల్తా..
● ఒకరి మృతి ● ఎనిమిది మందికి గాయాలు
సీతంపేట: కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తూ ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్నగూడకు చెందిన సవర లక్ష్మణ్ సీతంపేటలో గల అడ్వంచర్ పార్కులో గేట్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తన పుట్టినరోజును పార్కులో జరుపుకుంటానని చెప్పి భార్యాపిల్లలు, తల్లి, బంధువులను రమ్మని ఆహ్వానించాడు. దీంతో లక్ష్మణ్ తల్లి సవర పెద్దతిక్కమై (60), భార్యా పిల్లలు, బంధువులు ఆటోలో స్వగ్రామం నుంచి అడ్వంచర్ పార్కుకు బయలుదేరారు. సరిగ్గా అక్కన్నగూడ వద్దకు వచ్చే సరికి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద తిక్కమై అక్కడికక్కడే మృతి చెందగా.. సవర ఉషారాణి, స్మిత్, రాషి, సునేమి, రాయమన్స్, సవర సౌజన్య, సవర లీనా, సవర సోహెల్ గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా.. ముగ్గురిని శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తన పుట్టిన రోజునే తల్లి మృతి చెందడం.. కుటుంబ సభ్యులు గాయపడడంతో లక్ష్మణ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఎస్సై వై. అమ్మన్నరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని బీజే పాలెం గ్రామానికి చెందిన కడుకట్ల అప్పన్న (60) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి. లోకేశ్వరరావు తెలిపారు.
చికిత్సపొందుతూ ఒకరు..
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని కుందరతిరువాడ పంచా యతీ నీచుకవలస గ్రా మానికి చెందిన పత్తిక రా జేష్ (24)విశాఖపట్నం గాజువాకలో నూతన గృహానికి పెయింటింగ్‌లు వేసేందుకు వెళ్లి అక్కడ గత నెల 28న విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సునీత, తమ్ముడు రాకేష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదవశాత్తూ మరొకరు..
చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌పై ప్రమాదవశాత్తూ ప్రసాద్ (55) అనే వ్యక్తి మృతి చెందాడని జీఆర్‌పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రాజాం మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో పని చేస్తున్నారు. మూడు రోజుల కిందట తన స్వగ్రామమైన బొద్దాం వచ్చిన ఆయన తిరిగి విజయవాడకు వెళ్లేందుకు చీపురుపల్లి రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి చేరుకున్నాడు. అయితే ప్రసాద్ రైలు నుంచి జారి పడి మరణించాడా.. లేక మరే ఇతర కారణాల వల్ల మరణించాడో అన్న విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య..
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కొండపాలేం గ్రామంలో కె.బాలరాజు (32) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాలరాజు తన భార్య పద్మతో కలిసి శ్రీకాకుళం జిల్లా పలాసలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తుండేవాడు. బాలరాజుకు మద్యం అలవాటు ఉండడంతో నిత్యం భార్యతో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పలాస నుంచి కొండపాలెంలో ఉన్న తల్లి యశోద వద్దకు ఇటీవల వచ్చేశాడు. ఆదివారం ఉదయం తల్లితో గొడవపడి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేరడి సమీపంలో ఏనుగులు
భామిని: మండలంలోని నేరడి బీ సమీపంలో ఏనుగులు ఆదివారం కనిపించాయి. రబీ వరితో పాటు మొక్కజొన్న, కనకాంబరాలు, కూరగాయల పంటలు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు పంట చేలల్లో సంచరిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఏనుగులను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.