
ఆనంద్ బజార్‌లో గాయపడిన పోటు కార్మికుడు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ మందిరం సముదాయం ఆనంద బజార్ ప్రాంగణంలో పోటు కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఈ విచారకర సంఘటన చోటు చేసుకుంది. బాధిత కార్మికుడు బలభద్ర ప్రధాన్‌గా గుర్తించారు. ఆయన చంద్రపూర్ పోలీస్ ఠాణా పరిధి తొలొజొంఘొ గ్రామస్తుడు. మూల విరాట్లకు నివేదించిన మహా ప్రసాదాలను నెత్తిన మోసుకుని ఆనంద్ బజార్ ప్రాంగణానికి తరలిస్తుండగా వేడి పప్పు, అన్నం అతని శరీరంపై ఒలగడంతో గాయపడ్డాడు. తక్షణమే చికిత్స కోసం పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. ఆనంద బజార్ ప్రాంగణంలో నిత్యం స్వామి వారికి నివేదించిన మహా ప్రసాదాలను భక్తులకు విక్రయిస్తారు.
వంతెన కింద మంటలు
భువనేశ్వర్: ఖుర్దా రఘునాథ్‌పూర్ వంతెన కింద మంటలు చెలరేగాయి. సుమారు 2 గంటలు పైబడి మంటలు నిరవధికంగా రగిలాయి. స్థానిక చంద్రశేఖర్ పూర్ అగ్ని మాపక దళానికి చెందిన 2 యూనిట్ల యంత్రాంగం నిర్విరామంగా శ్రమించి మంటలు నివారించింది. ఈ సంఘటనతో నందన్‌కానన్ రోడ్డుకు ఒక వైపున వాహనాల రవాణా స్తంభించి పోయింది. ఈ పరిసరాల్లో 33 కేవీ విద్యుత్ లైన్ ఉండడంతో దీని పరిధిలో విద్యుత్ సరఫరాని తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా చర్యలో భాగంగా ఈ మేరకు నిర్ణయించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. వంతెన కింద చెత్త కుప్పకు ఎవరో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.
ఏఐసీసీ సమావేశాలకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు
కొరాపుట్: గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో జరగనున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రత్యేక సమావేశాలకు కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల నుంచి కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర సీఎల్‌పి నాయకుడు రాంచంద్ర ఖడం ఏఐసీసీ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ కలహండి జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రదేశ్‌కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ తో భేటీ అయ్యారు. నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన యువ ఏఐసీసీ సభ్యురాలు మానషా త్రిపాఠి తన బృందంతో అహ్మదాబాద్‌లోని సీబ్ల్యూసీ సమావేశాలు జరిగే సర్దార్ వల్లబాయ్ పటేల్ మెమోరియర్ కేంద్రానికి చేరుకున్నారు.
అడవులను కాపాడాలని ప్రచారం
పర్లాకిమిడి: అడవులను కాపాడాలని సంబంధిత అధికారులు ప్రచారం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టొద్దని మోహానా అటవీ రేంజ్ అధికారులు గజపతి జిల్లా మోహానా బ్లాక్ నలాఘాట్ సెక్షన్ మండిమర వారపు సంతలో మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు. జిల్లాలో మోహానా బ్లాక్‌లో అటవీ ప్రాంతాల్లో నిప్పు రాజుకున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా గుర్తించి మంటలను అదుపుచేశారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టడం వల్ల అనేక వృక్షాలు, వన్యప్రాణులు నాశనం అవుతాయని, పర్యావరణానికి ముప్పు సంభవిస్తుందని మంద్రబజు, నలాఘాట్, మండిమర గ్రామాల్లో అటవీ శాఖ బృందం ఫారెస్టు ఫైర్ సచేతన కార్యక్రమం చేపట్టారు.
అలరించిన కూచిపూడి నృత్యం
పర్లాకిమిడి: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్థానిక మార్కెట్ జంక్షన్ కోమటివీధి వద్ద రామాలయం ఆవరణలో కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. కళాకారులు రేఖానా వీధికి చెందిన వేణిషా కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన వేణిషా పట్నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందవరపు శ్రీనివాసరావు, పైడి శెట్టి నగేష్ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే సింకివీధిలోని రామాలయం వద్ద సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపారు.

ఆనంద్ బజార్‌లో గాయపడిన పోటు కార్మికుడు

ఆనంద్ బజార్‌లో గాయపడిన పోటు కార్మికుడు

ఆనంద్ బజార్‌లో గాయపడిన పోటు కార్మికుడు