
ట్రాఫిక్ సమస్య తీరేలా..!
భువనేశ్వర్: నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు వరుస డ్రైవింగ్ (లేన్ డ్రైవింగు) విధానం ప్రయోగాత్మకంగా బుధవారం ప్రవేశపెట్టారు. తొలుత స్థానిక జయదేవ్ విహార్ స్క్వేర్ వద్ద అమలులోకి తీసుకొచ్చారు. వాహన చోదకులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రయోగాన్ని రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టినట్లు నగర ట్రాఫిక్ డీసీపీ తపన్ మహంతి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలను తగ్గించే దృక్పథంతో సరైన డ్రైవింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు లేన్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంట నగరాల కమిషనరేట్ పోలీసు అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అవగాహన కార్యక్రమం జరుగుతుంది.
3 వరుసల్లో వాహనాల రవాణా
వాహన పరిమాణం మరియు వేగానికి అనుగుణంగా 3 వేర్వేరు వరుసల్లో వాహనాలను క్రమపద్ధతిలో నడిపిస్తారు. ఈ కార్యాచరణ కోసం ఏర్పాటు చేసిన నిర్ధారిత వరుసల్లో ఎలా వాహనాలు నడపాలో ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దీనికోసం పోలీసులు ట్రాఫిక్ కోన్‌లను ఉపయోగించి రోడ్డుపై 3 లేన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక లేన్‌లో ఉండి మరొక లేన్‌కు మారకుండా చర్యలు తీసుకుంటారు.
ప్రమాదాల నివారణకు కృషి
నగరంలో రద్దీగా ఉండే రోడ్లలో ఎటువంటి సూచనలు లేకుండా వాహనాలు ఒక లేన్ నుంచి మరొక లేన్‌కు మారడంతో అత్యధిక ప్రమాదాలకు ప్రధాన కారణంగా విశ్లేషించి ఈ చర్యకు జంట నగరాల కమిషనరేట్ పోలీసులు నడుంబిగించారు. ప్రజలు తమ వాహనం కోసం ఏ వరుస ఉద్దేశించబడిందో తెలుసుకుని క్రమపద్ధతిలో వాహనాలు నడపడంపై చైతన్యపరచి ఈ వ్యవస్థని విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు.
అంచెలంచెలుగా విస్తరణ
సాయంత్రం వేళల్లో జయదేవ్ విహార్ నుంచి డొమొణ స్క్వేర్ వరకు ఉన్న రోడ్డులో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రవాణా సులభతరం చేసేందుకు లేన్ డ్రైవింగ్ వ్యవస్థని ప్రయోగాత్మక చర్యగా అమలు చేశారు. ఈ చొరవ విజయవంతమైన ఫలితాలను ఇస్తే రాబోయే రోజుల్లో ఆచార్య విహార్, పటియా మరియు డొమొణ వంటి ప్రధాన కూడళ్లలో కూడా ఈ వ్యవస్థను అమలు చేస్తామని పేర్కొన్నారు.
వాహనాల వర్గీకరణ
ఎడమ వరస: సాధారణంగా సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు మరియు ఆటో రిక్షాలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల కోసం ఉద్దేశించబడింది. ఎడమ వైపు మలుపు తిరగడానికి సిద్ధమయ్యే వాహనాలు కూడా దీనిని ఉపయోగిస్తారు.
మధ్య వరుస: మితమైన వేగాన్ని కొనసాగించే కార్లు మరియు ఇతర చిన్నస్థాయి వాహనాలకు ఈ వరస నిర్ధారించారు. ఈ వరస పరిమిత వేగంతో ప్రయాణించడానికి అనువైనది.
కుడి వరుస: సాధారణంగా అధిగమించడానికి (ఓవర్ టేకింగ్) మరియు వేగంగా దూసుకుపోయే బస్సులు మరియు ట్రక్కులు వంటి భారీ వాహనాల కోసం ప్రత్యేకించబడింది.
నగరంలో లేన్ డ్రైవింగ్
జయదేవ్ విహార్‌లో ప్రయోగాత్మకంగా అమలు