
ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
రాయగడ: ఆహార కేంద్రాల పనితీరుపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల ఎదురుగా గల ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, 17 వార్డు కౌన్సిలర్ మజ్జి శ్రీనివాసరావు ,మున్సిపాలిటీ ఇంజినీర్లు, సిబ్బంది ఆహార కేంద్రానికి వెళ్లి నాణ్యత పరిశీలించారు. అందరితో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రూ.18కు భోజనం అందించడం కష్టంగా ఉందని, కాస్త పెంచగలిగితే బాగుంటుందని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు అన్నారు.
ఉపాధ్యాయుడు రక్తదానం
జయపురం: ఉపాధ్యాయులు విద్యాదానమే కాదు రక్తదానం కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ఆర్.భాలుగుడ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాద్యాయుడు కాలూచరణ బెహరను ఉదహరించవచ్చు. ఆ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాయల్ ముండగుడియ రక్తహీనత కారణంగా అనారోగ్యానికి గురైంది. విషమ పరిస్థితిలో బాలికను బుధవారం జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు హిమోగ్లోబిన్ తక్కువ ఉందని వెంటనే రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయుడు వెంటనే ఆస్పత్రికి వచ్చి బాలికకు అవసరమైన రక్తదానం చేసి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటారు. 2019లో కూడా విద్యార్థిని పాయల్ రక్తహీనతతో మృత్యువుతో పోరాడిన సమయంలో కూడా ఉపాధ్యాయుడు బెహర వచ్చి రక్త దానం చేశారని బాలిక బంధువులు వెల్లడించారు. బెహర సమాజానికి చేస్తున్న సేవను ప్రజలు అభినందిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఒంటిపూట పనివేళలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడి, కాశీనగర్, గుసాని, గుమ్మా, ఆర్.ఉదయగిరి, నువాగడ, రాయఘడ, మోహన బ్లాక్‌లలో గురువారం నుంచి ఒంటిపూట పనివేళలు అమలు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ పనివేళలను మార్చారు. అధిక ఎండల కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు జూన్ 15 వరకూ ఉదయం పూట కార్యాలయాల్లో సిబ్బంది పనిచేస్తారు. రాష్ట్రంలో టిట్లాఘడ్, రాయఘడ, నవరంగ్ పూర్, భఽధ్రక్, సోన్ పూర్ జిల్లాలో ఈ ఉదయం పనివేళలు పనిచేస్తాయి. మరికొన్ని జిల్లాలకు ఈ జీఓ వర్తించదు.
ఎలుగుబంటి దాడిలో వృద్ధుడికి గాయాలు
మల్కన్‌గిరి: ఎలుగుబంటి దాడిలో వృద్ధుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి క్యాంగ్ పంచాయతీ సారంగపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకోగా.. ధము నాయక్ (60) తీవ్రంగా గాయపడ్డారు. సారంగపల్లి గ్రామ సమీపంలోని అడవికి కట్టెలు తేవడానికి ధము నాయక్ గురువారం ఉదయం వెళ్లాడు. కట్టెలు కొడతున్న సమయంలో అతనిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అతను భయంతో కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని ఎలుగుబంటిని తరిమేశారు. గాయపడిన అతన్ని అంబులెన్స్‌లో మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న మత్తిలి పోలీసులు ఫారెస్టర్ వాసుదేవ్ నాయక్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చి బాధితుడ్ని పరామర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వన్యప్రాణుల దాడిలో గాయపడిన వారికి అందజేసే నష్టపరిహారాన్ని ధము నాయక్‌కు అందజేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు