రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Published Sat, Apr 12 2025 2:54 AM | Last Updated on Sat, Apr 12 2025 2:54 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌: మండలంలోని కె.కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న బొలెరో వాహనం టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలో రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరోలో ఉన్న ఒడిశా క్లీనర్‌ జితేంద్ర సాహు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

విప్లవ పోరాట యోధుడు పైలా

వజ్రపుకొత్తూరు రూరల్‌: వర్తమాన భవిష్యత్‌ విప్లవ పోరాటాలకు నిత్య చలనశీలతను రగిలించే పోరాట యోధుడిగా కామ్రేడ్‌ పైలా వాసదేవరావు నిలిచారని న్యూడెమొక్రసీ పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడులో శుక్రవారం పైల వాసదేవరావు వర్ధంతి నిర్వహించారు. పైలా స్మారక స్థూపం వద్ద పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు విప్లవ జోహార్లతో ఘన నివాళులు ఆర్పించారు. వాసుదేవరావు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ నెల 13న పలాసలో న్యూడెమొక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పైలా స్మారక సభ జరుగుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, ప్రజా సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు ఎం.వినోద్‌, గొరకల బాలకృష్ణ, పోతనపల్లి కుసు మ, ఆర్‌.మాధవరావు, పైల అప్పారావు, కృష్ణప్రసాద్‌, ఎస్‌.రామారావు, అప్పయ్య, ప్రసాద్‌, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.

36 రోజుల తర్వాత

స్వగ్రామానికి మృతదేహం

కవిటి: మండలంలోని ఆర్‌.బెలగాం గ్రామానికి చెందిన తిప్పన భుజంగరావు(43) ఇరాక్‌లో ఉద్యోగానికి వెళ్లి మార్చి 6న ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఎట్టకేలకు మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకోవడంతో అంత్యకఇయలు నిర్వహించారు. ఇరాక్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో నాలుగేళ్లుగా పనిచేస్తున్న భుజంగరావు అమ్మోనియా ట్యాంకర్‌ సమీపంలో పేలుడు కారణంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్‌ అశోక్‌ చొరవతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. భుజంగరావు మృతదేహాన్ని చూసిన తల్లి దమయంతి, భార్య జయలక్ష్మి, కుమార్తెలు రిషీ, దీక్ష కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఉద్యోగిని దూషించిన కేసులో రెండేళ్ల జైలుశిక్ష

రణస్థలం : విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని దూషించిన కేసులో బలగ చిరంజీవి అనే వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రెండేళ్ల జైలు శిక్ష, రూ.11వేలు ఆపరాధ రుసుం విధిస్తూ తీర్పు వెలువడిందని జె.ఆర్‌.పురం ఎస్సై ఎస్‌.చిరంజీవి తెలిపారు. 2020 డిసెంబర్‌ 4న రణస్థలం మండలం తెప్పలవలసలో వీఆర్‌ఓ పేదలందరికి ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హద్దురాళ్లు తీసేశారు. సమాచారం అందిన వెంటనే సచివాలయ సిబ్బంది, ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బలగ బుచ్చిబాబు, బలగ శ్రీను, మహేష్‌, రమణ, చిరంజీవి, యాగాటి లక్ష్మణరావు, భోగాపురపు సింహాచలం, ముక్కు అసిరయ్య, బంగారపు సూరప్పడులు హద్దురాళ్లు తొలగించినట్లు గుర్తించారు. ఈ విషయమై తహశీల్దార్‌కు సమాచారం ఇచ్చే సమయంలో వీఆర్‌ఓను బలగ చిరంజీవి అనే వ్యక్తి కులం పేరుతో దూషించాడు. దీంతో బాధిత వీఆర్‌ఓ జె.ఆర్‌.పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై ఈ.శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ ఎం.మహేంద్ర కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నేరం నిరూపితం కావడంతో చిరంజీవికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది.

రోడ్డు ప్రమాదంలో  వ్యక్తికి గాయాలు   1
1/3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో  వ్యక్తికి గాయాలు   2
2/3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో  వ్యక్తికి గాయాలు   3
3/3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement