
జింకకు తప్పిన ముప్పు
పర్లాకిమిడి : దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి గ్రామాల వైపు వస్తున్న జంతువులు కొన్నిసార్లు వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నాయి. గుసాని సమితి ఏడో మైలు వద్ద కోర్సండ గ్రామంలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఓ జింక ప్రవేశించడంతో వీధి కుక్కలు వెంటాడాయి. వెంటనే స్థానికులు గుర్తించి జింకను రక్షించి అటవీ అధికారులకు ఫోన్ చేసి అప్పగించారు. అటవీ శాఖ రేంజ్ అధికారి గణేష్ గ్రామానికి చేరుకుని జింకను ప్రాథమిక చికిత్స చేయడానికి పర్లాకిమిడి తీసుకెళ్లారు.
ఘనంగా హనుమాన్
జయంతి పూజలు
పర్లాకిమిడి: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కోమటివీధిలోని వేంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భద్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు జరిపారు. పర్లాకిమిడిలో సోమవారం ఒడియా ప్రజలు హనుమాన్ జయంతిని జరుపుకుంటుండగా, మంగళవారం కూడా జరుపుకోవచ్చని శ్రీనివాసాచార్యులు తెలియజేశారు.
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు
రాయగడ: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుణుపూర్‌లో గత బుధవారం వంశధార నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం అందించడంతో శుక్రవారం మైనింగ్ విభాగాధికారులు గుణుపూర్ వెళ్లారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి టిప్పర్ల యజమానులకు రూ.1.35 లక్షల జరిమానా విధించారు.
శాకంబరిగా ముత్యాలమ్మ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో భాగంగా శనివారం ఉదయం అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం నిజ రూప దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

జింకకు తప్పిన ముప్పు

జింకకు తప్పిన ముప్పు

జింకకు తప్పిన ముప్పు