
ఐక్యంగా పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం
● జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర
అధ్యక్షుడు లాకా వెంగళరావు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దేశానికి స్వాతంత్య్రం వచ్చినా బీసీలు బతుకులు అగ్రకుల పెత్తందారుల కబందహస్తాల మధ్యనే నలిగిపోతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు అన్నారు. బీసీలు రాజ్యాధికారం సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఏ ఉద్యమానికై నా శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుడితేనే విజయవంతమవుతుందన్నారు. శ్రీకాకుళం నగరంలో బీసీ నాయకులతో కలిసి ఓ ప్రయివేటు భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడుతూ బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.25 నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పి బీసీలకు న్యాయం చేసే పాలకుల్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యతగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని, లేకుంటే జీవితకాలం అగ్రకులాల చేతుల్లో కీలు బొమ్మల్లా ఉండిపోవాల్సి వస్తుందన్నారు. త్వరలో విజయవాడలో బీసీలందరితో కలిసి సభ ఏర్పాటుచేస్తామని చెప్పారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు కిల్లాన శ్రీనివాసరావు, ఆవు నరసింహరావు, ఎంఏ బేగ్, గద్దిబోయిన కృష్ణయాదవ్, నర్తు నరేంద్రయాదవ్, బి.రాజేష్, బాడాన దేవభూషణ్, గురునాథ్‌యాదవ్, కిల్లాన మాధవరావు, కిల్లాన దిలీప్, నాగేశ్వరరావు, లక్ష్మి, పి.రామకృష్ణ, కలగ కేశవరావు, శాలిన లక్ష్మణరావు, అలపాన త్రినాథరెడ్డి, వాన కృష్ణచంద్, ఆగూరు ఉమామహే శ్వరరావు, బి.సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.