
వంట బిల్లులు వెంటనే చెల్లించాలి
ఎచ్చెర్ల : మధ్యాహ్న భోజనం పథకం వంట కార్మికులకు పది వేల రూపాయల వేతనం, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్నబోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర డిమాండ్‌చేశారు. మండల కేంద్రం లావేరులో సోమవారం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ముందుగా స్కూల్ ఆవరణలోని అంబే డ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యా హ్న భోజన కార్మికులు రూ.3 వేల జీతంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరుగుతున్నా వేతనాలు, మెనూ చార్జీలు మాత్రం పెరగడం లేదన్నారు. ప్రాథమిక విద్యార్థులకు రూ.6.12 పైసలు, హైస్కూల్ విద్యార్థులకు రూ.9.29 పైసలతో నాణ్యమైన పౌష్టికాహారం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీ రూ.20కు పెంచాలని కోరారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, మౌలిక సదుపాయాలని కల్పించాలని డిమాండ్ చేశారు.