రైల్వే లైన్ ఆవశ్యకతపై మండలిలో ప్రస్తావిస్తా
చిలకలూరిపేట: చిలకలూరిపేటకు రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలని, దీని ఆవశ్యకత గురించి రానున్న శాసనమండలి సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హామీ ఇచ్చారు. శనివారం రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను ఆయన నివాసంలో కలసి రైల్వే లైన్ అంశాన్ని శాసనమండలిలో ప్రస్తావించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ స్పందిస్తూ ఈ ప్రాంతానికి రైల్వేలైను ఏర్పాటు చేయాలని గతం నుంచి ఎన్నో ప్రయత్నాలు కొనసాగాయన్నారు. రైల్వేలైన్ వల్ల చిలకలూరిపేటతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడి స్పిన్నింగ్ మిల్లులు, పొగాకు పరిశ్రమ, బాపట్ల జిల్లా పర్చూరు, మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులు, దిగుమతులు అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్థానికంగా ఉన్న పలు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు ఇతరా రాష్ట్రాలకు చెందిన వారేనని, వారి ప్రయాణ సౌకర్యానికి రైల్వేలైను ఎంతో అవసరమని తెలిపారు. దీంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కొండవీడు వంటి చారిత్రక ప్రదేశాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చేరుకోవడానికి ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్బంగా రైల్వేలైన్ సాధన సమితి కన్వీనర్ షేక్ సుభాని మాట్లాడుతూ చిలకలూరిపేటకు రైల్వేలైన్ ఏర్పాటు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు సైతం సంఘీభావం ప్రకటించారని వెల్లడించారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైల్వేలైన్ సాధన కోసం కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, ఎమ్మార్పీఎస్ నాయకులు అడపా మోహన్ మాదిగ, ముస్లిం సంక్షేమ సంఘం నాయకులు షేక్ బాజి, జనక్రాంతి పార్టీ నాయకుడు గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
Comments
Please login to add a commentAdd a comment