మహిమాన్వితం.. సాగర్‌మాత క్షేత్రం
విజయపురిసౌత్: ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా వెలుగొందుతున్న సాగర్‌మాత మహోత్సవాలను ఈ నెల 7, 8, 9 తేదీలలో ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయపురి సౌత్‌లో కృష్ణానది ఒడ్డున నెలవైన ప్రముఖ పుణ్యక్షేత్రం సాగర్‌మాత దేవాలయానికి రాష్ట్రంలోనే విశిష్టత కలిగిన దేవాలయంగా పేరుంది. భక్తులు కోర్కెలు తీర్చే తల్లి సాగర్‌మాత ఆలయానికి నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదిన అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాల నేపధ్యంలో మూడు రోజులు పుణ్యక్షేత్రంలో దివ్యసత్ప్రసాదన నిత్య ఆరాధనలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి.
కార్యక్రమాలు ఇలా..
7వ తేదీ ఉదయం 5.30గంటలకు సాగర్‌మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్‌చే, ఇతర ఫాదర్లచే దివ్యబలిపూజ, జపమాల, స్తుతి ఆరాధన, ఇలా.. రాత్రి 9గంటల వరకు ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.
● 8వ తేదీ ఉదయం 5 గంటలకు గురుశ్రీ చిన్నాబత్తిని కిరణ్‌కుమార్, ఇతర ఫాదర్లచే దివ్యబలిపూజ, వాక్య పరిచర్య, రాత్రి 9గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు.
● 9వ తేదీ గురువారం రాత్రి సాగర్‌మాత రథోత్సవం ప్రధానమైంది. ఈ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఆ రోజు ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు గురుశ్రీ చాట్ల కస్సార్‌చే దివ్యబలిపూజ, 6 గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్ల గురుశ్రీ మర్రి అనిల్ దివ్యబలిపూజ, 7 గంటలకు ముట్లూరు విచారణ గురువులు గురుశ్రీ మార్నేని దిలీప్‌చే దివ్యబలిపూజ, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు గురుశ్రీ ఏరువ బాలశౌర్రెడ్డిచే దివ్యబలిపూజ, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్యచే సమష్టి దివ్యపూజ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గురవరేణ్యులు గురుశ్రీ పామిశెట్టి తోమస్ బృందంచే గానం, రాత్రి 9గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు, కార్యక్రమాలు ఉంటాయి. ఏసుప్రభు పడిన శ్రమలను స్మరించుకుంటూ మోకాళ్ల నడక ప్రార్ధన చేస్తూ సాగర్‌మాతను దర్శించుకొనేందుకు ఇసుకరోడ్‌ను నిర్మించారు.
పూర్తయిన ఏర్పాట్లు..
రేపటి నుంచి 9వ తేదీ వరకు
సాగర్‌మాత మహోత్సవాలు
మాచర్ల మండలం కొప్పునూరు ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో పండుగ మూడు రోజులు ప్రథమచికిత్సా శిబిరం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం మూడు రోజులు ఏర్పాటు చేస్తున్నారు. మాచర్ల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రతి అరగంటకు విజయపురిసౌత్‌లోని సాగర్‌మాత దేవాలయానికి బస్‌లు అందుబాటులో ఉంటాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మాచర్ల రూరల్ సీఐ నఫీజ్‌బాష ఆద్వర్యంంలో విజయపురిసౌత్ ఎస్‌ఐ మహమ్మద్ షఫీ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గుడి సమీపంలోని కృష్ణా జలాశయంలో స్నానం చేసే భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లను, ప్రత్యేక బోట్‌ను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment