కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న ఇసుక టిప్పర్
తొమ్మిది మందికి గాయాలు
కారెంపూడి: పొలం పనులకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొనడంతో 9 మంది గాయపడిన ఘటన మండలంలోని నరమాలపాడు గ్రామం వద్ద బుధవారం జరిగింది. మండలంలోని మిరియాల గ్రామం నుంచి మిరపకాయలు కోసేందుకు నరమాలపాడు గ్రామానికి కూలీలు ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నరమాలపాడు గ్రామ ఎస్సీ కాలనీ వద్ద ట్రాక్టర్‌కు అడ్డుగా కోళ్లు రావడంతో డ్రైవర్ స్లో చేశాడని తెలుస్తోంది. ఇదే సమయంలో వెనుకగా అమరావతి నుంచి ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రక్కును వెనుకగా ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న వారిలో 9 మందికి గాయాలయ్యాయి. వద్దెబోయిన లక్ష్మయ్య, ఆయన భార్య నాగలక్ష్మి, గండికోట ఆవులయ్య, కఠారి సంధ్య, బైనబోయిన వెంకటేశ్వర్లు, పేరుబోయిన అంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మారుబోయిన పార్వతి, మారుబోయిన నర్సయ్య, సకినాల సైదులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో కొందరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు, మరికొందరిని నర్సరావుపేట ఏరియా ఆస్పత్రికి 108 అంబులెన్సులలో తరలించారు. టిప్పర్ ఢీకొనే సమయంలో ట్రక్కు వెనుక కూర్చున్న వారు కాళ్లు తక్షణమే పైకిపెట్టుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ వాసు పరిశీలించారు. ఎస్‌ఐ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment