అన్ని రంగాల్లో మహిళలు పురోగతి సాధించాలి
నాదెండ్ల: ఆర్థ్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలు పురోగతి సాధించాలని, కుటుంబ నిర్ణయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని పల్నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ హీరాలాల్‌నాయక్ చెప్పారు. నాదెండ్ల శుభోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో హెల్త్ సబ్ కమిటీ, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు, వీవోఏలు, ఆఫీస్ బేరర్స్‌కు మూడు రోజుల పాటూ జరగనున్న శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూ లన లక్ష్యాలు నెరవేరాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, కుటుంబ నిర్ణయాల్లో కీలక భూమిక పోషించాలన్నారు. సామాజిక వనరులను సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నపుడే మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధ్యమౌతుందన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఇన్‌చార్జి డీబీ ప్రియదర్శిని, వన్‌స్టాప్ సకీ సెంట్రల్ లీగల్ అడ్వైజర్ కంభంపాటి వాణిశ్రీ, ఏపీఎం మేకతోటి రమేష్, సీసీలు సాంబశివరావు, హేమలత, సుధ, సాగర్, యానిమేటర్లు పాల్గొన్నారు.
పేపర్ లీక్ చేస్తే.. గుర్తింపు రద్దు చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సాయికుమార్ డిమాండ్
నరసరావుపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడిన ఘటనలో అరెస్ట్ అయిన స్వామి వివేకానంద కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కె.సాయికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో సాయి కుమార్ మాట్లాడుతూ పలుమార్లు పేపర్లు లికేజీలకు పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసేందుకు కళాశాల యాజమాన్యం అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. చదువుకొని పరీక్షలు రాయాల్సిన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదన్నారు. ఇటువంటి ఘటనలు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చదువుకున్న విద్యార్థులు చాలా అవకాశాలను కోల్పోతారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. బీఈడీ కళాశాలలు మొదలుకొని పరీక్షలు వరకు రాష్ట్రంలో ఉన్న పలు కళాశాలలో పేపర్ లీకేజీలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి ఘటనలపై యూనివర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించకపోవటంతో లోపాయి కారి ఒప్పందాలతో యూనివర్సిటీ అధికారులు పాల్పడుతున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జరిమానాలు కాకుండా ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు.
ఆర్థిక స్వావలంబనతోనే
కుటుంబ వృద్ధి
గ్రామీణాభివృద్ధి శాఖ
జిల్లా పీడీ హీరాలాల్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment