
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులుస్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో మే నెల 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. పల్నాడు జిల్లా పరిధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 50 శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శిబిరంలో 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 25 మంది చొప్పున బాలురు, బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. జిల్లా పరిధిలోని క్రీడా అసోసియేషన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తాము శిక్షణ ఇవ్వనున్న క్రీడాంశం, ప్రదేశం పేర్కొంటూ పూర్తి వివరాలతో ఈ నెల 17వ తేదీలోగా స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలన్నారు.
పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి
పల్నాడు జిల్లా పరిధిలోని అర్హులైన క్రీడాకారులు నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2026వ సంవత్సరం గణతంత్ర దినోత్సవాల్లో అందించే పద్మ పురస్కారాల పరిశీలనకు దరఖాస్తులు పంపనున్నట్టు తెలిపారు. వివరాలను www. padmaawards.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.