
పునర్విభజనతో దక్షిణాదికి నష్టం ఖాయం
నరసరావుపేట: పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ఆధారంగా పెంచితే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. ‘పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన–ఫెడలరిజం’ అనే అంశంపై మంగళవారం కోటప్పకొండ రోడ్డులోని విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సెమినార్‌లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. 2026లో జరిగే డీలిమిటేషన్‌తో జనాభా ఆధారంగా జరిగితే 543 సీట్లు 843 కు పెరుగుతాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల వెనుకబాటుతనంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. దీని వలన అక్కడ సీట్లు పెరిగే అవకాశం బాగా ఉందన్నారు. యూపీలోని 80 సీట్లు 128 అవుతాయన్నారు. ఉమ్మడి ఏపీలోని 42 సీట్లు కేవలం 48 సీట్లు మాత్రమే అవుతాయన్నారు. దీని వలన రాజకీయంగా దక్షణాది రాష్ట్రాలు నష్టపోతాయని తెలిపారు. దీంతో దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య సమతుల్యత లోపిస్తుందన్నారు. దీని వల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. అన్ని రాజకీయపార్టీలు దీనిపై చర్చించాలని కోరారు. ఏపీలోని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసమాజం చైతన్యవంతమై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని సూచించారు.
పార్లమెంట్ నియోజవర్గాలను సీట్ల ప్రాతిపదికన విభజిస్తేనే న్యాయం జనాభా ప్రాతిపదికన సరికాదన్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

పునర్విభజనతో దక్షిణాదికి నష్టం ఖాయం