
లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పే అంతిమం
● న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డి ● జాతీయ లోక్ అదాలత్‌పై పోలీసు, రెవెన్యూ అధికారులతో సమీక్ష
సత్తెనపల్లి: రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పు (అవార్డ్) అంతిమ తీర్పు అని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయకుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ఆవరణలో గల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో ఏప్రియల్ 10వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌పై శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేశారు. సీనియర్ సివిల్ జడ్జి విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సత్తెనపల్లి న్యాయస్థాన పరిధిలో ఉన్న అన్ని కోర్టుల్లో ఉన్న రాజీ పడదగిన కేసులలో ఎక్కువగా రాజీ అయ్యేలా చూడాలన్నారు. ముందుగా ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులు? రాజీ పడదగిన కేసులు? ఎన్ని ఉన్నాయి అనే దానిపై, అన్ని అంశాలపై ఆయా పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష నిర్వ హించారు. సమీక్షలో సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సుబ్బారావు, మిగిలిన పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐలు పాల్గొన్నారు. అనంతరం సత్తెనపల్లి న్యాయస్థాన పరిధిలో ఉన్న అన్ని మండలాల తహసీల్దార్ లతో సివిల్ వివాదాలు, తదితర అంశాలపై మాట్లాడారు. సత్తెనపల్లి ఏజీపీ షేక్ బాలి సైదా, సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచి ఏవో సరోజిని, అన్ని మండలాల తహసీల్దార్‌లు పాల్గొన్నారు. ఈ రెండు సమీక్షలలో ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఏ.తౌషీద్ హుస్సేన్, ఒకటో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) మహ్మద్ గౌస్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఉన్నారు.