
జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు
నరసరావుపేట: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి జిల్లాలోని ప్రధాన రహదారులు, పలు ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ మద్యం సేవించటం, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై దృష్టి సారిస్తూ విస్తృతంగా వాహనాల తనిఖీలు చేశారు. నగర శివారు ఖాళీ ప్రదేశాలు బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై దాడులు నిర్వహించి 132 కేసులు నమోదు చేశారు. సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. అలాగే జిల్లాలోని నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వరవకట్ట, ఈపూరు మండలం బొగ్గరం గ్రామం, అచ్చంపేట, పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామం, దుర్గి మండలం ఆత్మకూరు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.